ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర సచివాలయంలో సోమవారం ప్రత్యేక కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలపే అవకాశముంది. మొత్తం 20 అంశాల అజెండాతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
SIPBలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. సీఆర్డీఏ అధారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కూడా మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ సబ్ కమిటీ ఓ నిర్ణయం తీసుకోనుంది.
ఈ రోజు కేబినెట్‌లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణపై ఇటీవల ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా నివేదిక అందించిన విషయం తెలిసిందే. ఈ నివేదికపై అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
కేబినెట్ భేటీలో వైఎస్సార్ తాడిగడప పేరును తాడిగడప మున్సిపాలిటీగా మార్చే అంశంపై చర్చించనున్నారు. అలాగే, ఏపీ టీచర్స్ ట్రాన్స్‌ఫర్స్ రెగ్యులేషన్ యాక్ట్ 2025 బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపే అవకాశముంది.
అమరావతిలో రూ. 22,607 కోట్ల విలువైన 22 పనులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేపట్టిన రూ. 15,081 కోట్ల విలువైన 37 పనులకు మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.
కేబినెట్ భేటీలో మొత్తం రూ. 1,21,659 కోట్ల పెట్టుబడులకు అనుమతి ఇవ్వనుంది. ప్రీమియర్ ఎనర్జీస్ లిమిటెడ్, దాల్మియా సిమెంట్, లులూ గ్లోబల్ ఇంటర్నేషనల్, ఇండోసాల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్, బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ ప్రైవేట్ లిమిటెడ్, ఏపీ ఎన్జీఈఎల్ హరిత్ అమ్రిత్ లిమిటెడ్ సహా పలు సంస్థల పెట్టుబడులకు ఆమోదం తెలిపే అవకాశముంది.
ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో దాదాపు 80 వేల మంది ఉద్యోగ అవకాశాలు పొందనున్నారు. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. 26 జిల్లాల్లో ఐదు రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాలను నెల రోజుల్లో ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఉపాధ్యాయుల ట్రాన్స్‌ఫర్లకు సంబంధించిన సవరణ బిల్లుకు కూడా మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.

One thought on “సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం.. పలు కీలక అంశాలపై చర్చ”
Comments are closed.