అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో విభిన్నమైన చిత్తూరు యాస ఉపయోగించి తన పాత్రకు ప్రాణం పోశాడు. స్టార్ హీరోల నుంచి ఇలాంటి యాస వినడం అరుదుగా ఉండటంతో, ఈ ప్రయోగానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఇప్పుడు అదే బాటలో యంగ్ హీరో అఖిల్ అక్కినేని కూడా నడుస్తున్నాడని సమాచారం. ప్రస్తుతం మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అఖిల్ కొత్త సినిమా తెరకెక్కుతుండగా, ఇందులో ఆయన చిత్తూరు యాస నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్లో ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతుండగా, తదుపరి షెడ్యూల్ చిత్తూరు ప్రాంతంలో ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక మాండలికంలో మాట్లాడేందుకు అఖిల్ ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. గతంలో అల్లు అర్జున్ ‘పుష్ప’ కోసం ఎలాంటి ప్రిపరేషన్ చేశాడో, ఇప్పుడు అఖిల్ అదే స్థాయిలో కష్టపడుతున్నాడని టాలీవుడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది.
‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన మురళీ కిషోర్ అబ్బూరు ఈ చిత్రాన్ని విభిన్నమైన పల్లెటూరి కథాంశంతో తెరకెక్కిస్తున్నాడు. అఖిల్ కెరీర్లో ఇది మొదటి కమర్షియల్ బిగ్గెస్ట్ హిట్ అవుతుందని యూనిట్ సభ్యులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో నిర్మిస్తుండగా, సితార ఎంటర్టైన్మెంట్స్ భాగస్వామిగా ఉంది.
ఇటీవల నాగ చైతన్య ‘తండేల్’ సినిమాతో ₹100 కోట్ల క్లబ్లో చేరి, శ్రీకాకుళం యాసలో తన డైలాగ్ డెలివరీతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు తమ్ముడు అఖిల్ కూడా చిత్తూరు యాసలో మాట్లాడేందుకు శిక్షణ తీసుకుంటుండటం విశేషం. డబ్బింగ్తో మేనేజ్ చేయడం కంటే, నేరుగా షూటింగ్ సమయంలోనే మాండలికాన్ని అవలంభించడం నేచురల్ ఫీలింగ్ ఇస్తుందనే నమ్మకంతో హీరోలు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు.

One thought on “అఖిల్ అక్కినేని కొత్త ప్రయోగం – చిత్తూరు యాసలో శిక్షణ”
Comments are closed.