తెలంగాణ అసెంబ్లీ బీఏసీ (BAC) సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమైన అంశాలను ప్రస్తావించారు. హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ప్రభుత్వం నీటిని తరలించుకుంటుంటే తెలంగాణ ప్రభుత్వం చూస్తూ మౌనంగా ఉందని విమర్శించారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించాలని బీఏసీ సమావేశంలో డిమాండ్ చేసినట్లు తెలిపారు.
హరీష్ రావు మాట్లాడుతూ, ప్రశ్నాపత్రాలు లీక్ కావడం, అసెంబ్లీ బిజినెస్ ముందే లీక్ అవ్వడం వంటి అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు మైక్ ఇవ్వొద్దని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా స్పీకర్ను బలవంతం చేస్తున్న విషయాన్ని బీఏసీలో లేవనెత్తినట్లు వెల్లడించారు. సభలో బీఆర్ఎస్కు సంఖ్యాబలాన్ని అనుసరించి సమయం ఇవ్వాలని కోరారు. రైతాంగ సమస్యలు, తాగునీటి సమస్యలు, సాగునీటి సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ నదీ జలాల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీష్ రావు విమర్శించారు. ఏపీ ప్రభుత్వం నీటిని తరలించుకుంటుంటే తెలంగాణ ప్రభుత్వం చోద్యంగా చూస్తోందని ఆయన ఆరోపించారు. బిల్లులు చెల్లింపులో 20 శాతం కమిషన్ తీసుకుంటున్న విషయాన్ని అసెంబ్లీలో చర్చించాలని సూచించారు.
ఇక, రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అమలు చేయకపోవడం, బార్స్, వైన్స్, బెల్ట్ షాపులు పెరుగుతున్న అంశాలపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ ఉచిత హామీపై అసెంబ్లీలో చర్చించాలని కోరినట్లు తెలిపారు. బీఏసీ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టులో కూలిన పిల్లర్ల నిర్లక్ష్యపూర్వక విసర్జనపై తీవ్రంగా ప్రశ్నించినట్లు ఆయన వెల్లడించారు. నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ వంటి అంశాలను కూడా అసెంబ్లీలో చర్చించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

One thought on “నీటి సమస్యపై రాష్ట్ర ప్రభుత్వంపై హరీష్ రావు తీవ్ర విమర్శలు”
Comments are closed.