బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. మహదేవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు.
గతేడాది అనుమతులు లేకుండా మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించారని, డ్రోన్ ఎగరవేశారంటూ కేటీఆర్ సహా మరికొంతమందిపై కేసులు నమోదయ్యాయి. బుధవారం జరిగిన విచారణలో, ఎలాంటి ఆధారాలూ లేకుండా మహదేవ్‌పూర్ పోలీసులు కేటీఆర్‌పై కేసు నమోదు చేశారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. డ్రోన్ ఎగురవేశారని అనడానికి ఎలాంటి సాక్ష్యాలూ లేవని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. తప్పుడు కేసు కావడంతో ఎఫ్ఐఆర్‌ను వెంటనే కొట్టివేయాలని కోరారు.
దీనిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాట్లాడుతూ, మేడిగడ్డ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి ఎంతో కీలకమని, ప్రాజెక్టు నిషిద్ధ ప్రాంతంలోకి వెళ్లి అనుమతి లేకుండా డ్రోన్ ఎగరవేయడం భద్రతకు ముప్పు కలిగించే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఈనెల 18వ తేదీకి వాయిదా వేసింది.
గతేడాది మేడిగడ్డ కుంగిపోవడం వివాదాస్పదంగా మారడంతో బీఆర్ఎస్ నేతలతో కలిసి కేటీఆర్ జులై 16న మేడిగడ్డ సందర్శనకు వెళ్లారు. అప్పట్లో డ్రోన్ ఎగరవేశారంటూ కేటీఆర్‌పై మహదేవ్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

4 thoughts on “కేటీఆర్ కేసుపై తెలంగాణ హైకోర్టు విచారణ..”
Comments are closed.