రెండోసారి గెలుపే అసలైన విజయం: సీఎం రేవంత్

Revanthreddy

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాలపై జరిగిన సీఎల్పీ సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వంలో ఇది రెండో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశమని తెలిపారు.

ఈ సమావేశాలు అత్యంత కీలకమని, 15 నెలల్లో చేపట్టిన ప్రభుత్వ కార్యక్రమాలపై పూర్తిగా చర్చించుకునేందుకు ఇది మంచి అవకాశం అని అన్నారు. ప్రతిపక్షాల విమర్శలను సమర్థంగా ఎదుర్కోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు.

“మొదటి సారి గెలవడం పెద్ద విషయం కాదు. రెండోసారి గెలవడం గొప్ప విషయం” అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. సమావేశాలకు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా హాజరవ్వాలని, సభ్యులంతా సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు.

వచ్చే నెల 6వ తేదీ నుంచి జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులతో లంచ్ మీటింగ్‌లు నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. ఈ సమావేశాల్లో స్థానిక సమస్యలు, ఇతర అంశాలపై చర్చిస్తామని వెల్లడించారు.

“మంత్రుల నియోజకవర్గాలకు ఎక్కువ నిధులు వెళ్తున్నాయనే అభిప్రాయం ఉంది. కానీ ఈసారి అందరికీ సమానంగా నిధులు కేటాయిస్తాం” అని స్పష్టం చేశారు. “మంత్రులు తప్పనిసరిగా సభకు హాజరవ్వాలి. మొక్కుబడిగా హాజరుకావడం మంచిది కాదు” అని సూచించారు.

Read More