అంగన్‌వాడీలకు న్యాయం చేయండి.. షర్మిల డిమాండ్

YS-Sharmila

అంగన్‌వాడీలకు అన్యాయం జరుగుతోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. మంగళవారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్‌వాడీలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పిందని విమర్శించారు. అంగన్‌వాడీల ఆందోళనను అణిచివేయడం కూటమి ప్రభుత్వ నియంతృత్వానికి నిదర్శనమని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంగన్‌వాడీల డిమాండ్లు పూర్తిగా న్యాయబద్ధమైనవని పేర్కొన్న షర్మిల, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలన్నారు. అంగన్‌వాడీలకు నెలకు రూ. 26వేలు గౌరవ వేతనం ఇవ్వాలని, గ్రాట్యూటీ చెల్లింపుపై హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మినీ అంగన్‌వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా పరిగణించాలన్నారు.

అలాగే హెల్పర్ల పదోన్నతిపై నిర్దిష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని, పెండింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని షర్మిల కోరారు. విధి నిర్వహణలో అంగన్‌వాడీలు మరణించినట్లయితే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగంతో పాటు మట్టి ఖర్చుల కోసం రూ. 20 వేలు అందించాలన్నారు.

ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రభుత్వం ఈ డిమాండ్లపై ప్రకటన చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల డిమాండ్ చేశారు.

Read More