కేసీఆర్‌పై సీఎం రేవంత్ సవాల్

revanth reddy vs kcr

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. శనివారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన, కేసీఆర్‌పై అనేక వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జలాలపై చర్చ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, కేసీఆర్ అసెంబ్లీలోకి వచ్చినప్పుడు ఆ అంశాన్ని చర్చకు తీసుకురావాలని రేవంత్ సవాల్ విసిరారు. తమ ప్రభుత్వం తప్పు చేసినట్లు తేలితే క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.

రేవంత్ మాట్లాడుతూ, ఎమ్మెల్యేగా కేసీఆర్‌కు రూ.54.84 లక్షల జీతం ఇచ్చినప్పటికీ ఆయన కేవలం రెండు సార్లు మాత్రమే అసెంబ్లీకి వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. రోజా ఇంట్లో కేసీఆర్ రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమగా చేస్తానని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. సాగర్ ప్రాజెక్టుకు సీఆర్‌పీఎఫ్ బలగాలు వచ్చినప్పుడు బీఆర్‌ఎస్ నిశ్శబ్దంగా ఉండిందని, ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుబడుతోందని మండిపడ్డారు.

కృష్ణా నీటి విషయంలో రాష్ట్రానికి మరణశాసనం రాశారని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచారని గుర్తుచేశారు. కమీషన్ల కోసమే జూరాల నుంచి తీసుకోవాల్సిన నీటిని శ్రీశైలం బ్యాక్ వాటర్ ద్వారా తీసుకువచ్చారని ఆరోపించారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ ఉమ్మడి రాష్ట్రంలోనే 20 కి.మీ మేర పూర్తి చేశారని తెలిపారు. బీఆర్‌ఎస్ నేతలు ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై సానుభూతి చూపించాల్సిన పరిస్థితిలో పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు.

రేవంత్ మాట్లాడుతూ, “మీ స్ట్రేచర్ గురించి ఉన్న ఆలోచన స్టేట్ ఫ్యూచర్ మీద లేదా?” అంటూ బీఆర్‌ఎస్ పై సెటైర్లు వేశారు. బీఆర్‌ఎస్ ప్రస్తుతం మార్చురీలో ఉందన్న వ్యాఖ్యలపై కేటీఆర్, హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని ప్రస్తావించారు. “కేసీఆర్ వందేళ్లు జీవించి ప్రతిపక్షంలోనే ఉండాలని కోరుకుంటున్నా,” అంటూ సీఎం రేవంత్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

అంతేగాక, రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘిస్తూ 2022 బడ్జెట్ సమావేశాలు గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రారంభించారని రేవంత్ గుర్తుచేశారు. గత ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను పాటించలేదని విమర్శించారు. మహిళా గవర్నర్‌ను అవమానించడం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన తప్పేనని తెలిపారు.

ఈ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ సభ్యులు మండిపడి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. సీఎం వ్యాఖ్యలు అనుచితమని వారు పేర్కొన్నారు. ఈ వాకౌట్‌పై స్పందించిన రేవంత్, “బీఆర్‌ఎస్ నేతలు ఇలాగే వ్యవహరిస్తే రాబోయే ఎన్నికల్లో సున్నానే మిగులుతుంది,” అని ఎద్దేవా చేశారు. రైతులకు రుణమాఫీ, బోనస్, రైతు భరోసా వంటి పథకాలు అమలు చేస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

Read More

One thought on “కేసీఆర్‌పై సీఎం రేవంత్ సవాల్

Comments are closed.