cow protection : సీఎం కీలక ఆదేశాలు

తెలంగాణ రాష్ట్రంలో గోవుల సంరక్షణకు ప్రత్యేక దృష్టి సారిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్ర గోసంరక్షణ విధానాన్ని రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న మోడల్స్‌ను అధ్యయనం చేసి, తెలంగాణకు అనువైన విధానాన్ని తేల్చేందుకు ముగ్గురు కీలక అధికారులతో ప్రత్యేక కమిటీని సీఎం ఏర్పాటు చేశారు.

మంగళవారం తన అధికార నివాసంలో ఉన్నతాధికారులతో గోసంరక్షణపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి, గోవుల మరణాలు వసతి, స్థలాల లేకపోవడమే ప్రధాన కారణమని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని నివారించేందుకు తక్షణ చర్యలు అవసరమని స్పష్టం చేశారు.

ఈ కమిటీలో పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు సభ్యులుగా ఉంటారు. ఈ ముగ్గురు ఇతర రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేసి, నివేదిక సమర్పించనున్నారు.

తొలిదశగా రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో ఆధునిక గోశాలలు నిర్మించాలని సీఎం సూచించారు. వేములవాడ, యాదగిరిగుట్ట, హైదరాబాద్ శివారులోని ఎనికేపల్లి, పశు విశ్వవిద్యాలయం సమీపంలో విశాలమైన స్థలాల్లో ఈ గోశాలలు ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా వేములవాడ వద్ద కనీసం వంద ఎకరాల విస్తీర్ణంలో గోశాల నిర్మించాలని స్పష్టంగా పేర్కొన్నారు.

భక్తులు మొక్కుబడిగా సమర్పించే కోడెలకు ప్రత్యేక సంరక్షణ కల్పించాలన్నారు. గోసంరక్షణకు అవసరమైన నిధుల విషయంలో ప్రభుత్వం వెనుకాడదని సీఎం హామీ ఇచ్చారు. మన సంస్కృతిలో గోవులకు ఉన్న ప్రాధాన్యాన్ని గౌరవిస్తూ, ఈ విధానం రూపుదిద్దుకోవాలని ఆయన పేర్కొన్నారు.

Read More : బనకచర్ల ప్రాజెక్టు నిజాలు: మంత్రి నిమ్మల