హనీమూన్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగు లోకి.

దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించిన రాజా రఘువంశీ హత్య కేసులో మరో కీలక విషయం వెలుగు చూసింది. వేట కొడవళ్లతో హత్య జరుగుతున్న సమయంలో రాజా భార్య సోనమ్ అక్కడి నుంచి పరారైనట్టు తాజాగా జరిగిన క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్‌లో స్పష్టం అయింది. భర్త చనిపోయిన తర్వాతే ఆమె తిరిగి హత్య స్థలానికి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిన్న సోనమ్ సహా మిగతా నిందితులను మేఘాలయలోని షిల్లాంగ్‌కు 65 కిలోమీటర్ల దూరంలోని సోహ్రా ప్రాంతానికి తీసుకెళ్లి నేరం జరిగిన విధానాన్ని పునఃసృష్టించారు. ఈ సందర్భంగా కేసుతో సంబంధించి మరిన్ని కీలక విషయాలు బయటపడ్డాయి.

పోలీసుల కథనం ప్రకారం, కిరాయి హంతకుల్లో ఒకడైన విశాల్ సింగ్ చౌహాన్ మొదట రాజాపై వేట కొడవలితో దాడి చేశాడు. తీవ్ర గాయాల వల్ల రాజా కేకలు వేయడం మొదలుపెట్టగానే సోనమ్ భయంతో అక్కడి నుంచి పారిపోయింది. రీకన్‌స్ట్రక్షన్ సందర్భంగా పోలీసులు రెండో వేట కొడవలిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇది రాజా మృతదేహం మరియు మొదటి ఆయుధం లభించిన రియాట్ అర్లియాంగ్ ప్రాంతంలోని లోయలో పార్కింగ్ లాట్ కింద కనిపించింది. ఈ ఆధారాలతో, హత్యకు రెండు ఆయుధాలు వాడినట్లు పోలీసులు నిర్ధారించారు.

ఇదిలా ఉండగా, ఈ దారుణ ఘటనపై సోనమ్ సోదరుడు గోవింద్ స్పందించారు. ఈ ఘటన తమ కుటుంబానికి అపార నష్టం కలిగించిందని, సోనమ్‌తో ఇకపై ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రాజా కుటుంబానికి న్యాయం జరగాలనే పోరాటంలో తాము పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు.

కేసు సంబంధిత దర్యాప్తు వేగంగా కొనసాగుతున్నట్టు పోలీసులు వెల్లడించారు. రాజా హత్యపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

Read More : పెళ్లికి కొన్ని గంటల ముందు వరుడి దారుణ హత్య…