రైతు సంక్షేమంపై చర్చకు కేటీఆర్ సిద్ధం

KTR

తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వీకరించారు. ఈ మేరకు మంగళవారం ఆయన సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌కు చేరుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో కలిసి తెలంగాణ భవన్ నుంచి బయలుదేరిన కేటీఆర్ హాజరుతో రాష్ట్ర రాజధానిలో రాజకీయ వేడి మరింత పెరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితంగా పాలన సాగిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రైతుల సహా అన్ని వర్గాలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యంగా రైతు రుణ మాఫీ, పంట బోనస్ వంటి సమస్యలపై తాము ఎంతకాలంగా చర్చ కోరుతున్నా, అధికార కాంగ్రెస్ పార్టీ స్పందించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. “అసెంబ్లీలో మైక్ ఇవ్వకుండా గొంతు నొక్కుతున్నారు. కనీసం ప్రెస్ క్లబ్‌లో అయినా చర్చకు రావాలి,” అని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారని తెలిసిందని పేర్కొన్న కేటీఆర్, ఆయన రాలేకపోతే కచ్చితంగా మంత్రుల్లో ఒకరిని చర్చకు పంపించాలని సూచించారు.

అంతేకాదు, సీఎం రేవంత్‌కు వీలైన మరొక తేదీ, ప్రదేశం సూచించినా తాము హాజరవుతామని స్పష్టం చేశారు. అసెంబ్లీలో స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఉంటే అక్కడే చర్చించేందుకు కూడా తాము సిద్ధమని వెల్లడించారు.

Read More : హైదర్‌గూడలో హైడ్రా కూల్చివేతలు…