బనకచర్ల ప్రాజెక్టు నిజాలు: మంత్రి నిమ్మల

nimala

బనకచెర్ల ప్రాజెక్టుపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. మంగళవారం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ, గత 50 ఏళ్లుగా గోదావరి నదిలోని దాదాపు 3,000 టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా పోతూ వస్తోందని, అందులో 200 టీఎంసీల నీటిని వినియోగించి బనకచర్లకు తరలించాలన్నదే ఈ ప్రాజెక్ట్ ఉద్దేశమని పేర్కొన్నారు.

మూడు సెగ్మెంట్‌లుగా నిర్మాణం

బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం మూడు విడతల్లో జరుగుతుందని మంత్రి వివరించారు.

  • సెగ్మెంట్ 1: పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు,
  • సెగ్మెంట్ 2: ప్రకాశం బ్యారేజీ నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ వరకు,
  • సెగ్మెంట్ 3: బొల్లాపల్లి నుంచి బనకచర్ల వరకు.

ఈ ప్రాజెక్టు పూర్తిగా సాంకేతికంగా, నిబంధనల ప్రకారమే ముందుకు సాగుతుందని తెలిపారు.

తెలంగాణ విమర్శలు రాజకీయ ప్రేరితమే

తెలంగాణలో కొన్ని వర్గాలు అంతర్గత రాజకీయాలకు ఈ ప్రాజెక్టును వాడుకుంటున్నాయని మంత్రి విమర్శించారు. “ఏపీ ప్రభుత్వం ఎలాంటి అనుమతి లేకుండా ప్రాజెక్టును చేపట్టిందని చెబుతుండటం అసత్యం. ఇప్పటికే సీడబ్ల్యూసీకి ప్రాథమిక నివేదిక సమర్పించాం. ఆమోదం అనంతరమే డీపీఆర్ ఇస్తాం,” అని చెప్పారు. పోలవరం, బనకచర్ల ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియ చట్టపరంగా జరుగుతోందని పేర్కొన్నారు.

వరద జలాల వినియోగమే లక్ష్యం

ఆంధ్రప్రదేశ్ దిగువ రాష్ట్రంగా ఉన్న నేపథ్యంలో, ఎగువ రాష్ట్రాల అవసరాలు తీరాక మిగిలిన వరద జలాలను వినియోగించుకోవడం తమ హక్కని మంత్రి తెలిపారు. “ప్రతి సంవత్సరం వేలాది టీఎంసీల నీరు సముద్రంలోకి వృథాగా పోతోంది. వర్షాకాలం పూర్తి కాకముందే భారీగా నీరు సముద్రంలోకి పోతున్న సంగతి గుర్తుంచుకోవాలి,” అని తెలిపారు.

చంద్రబాబు సహకారాన్ని గుర్తుంచుకోండి

తెలంగాణలోని దేవాదుల, బీమా, ఎస్సార్ఎస్పీ వంటి అనేక ప్రాజెక్టులకు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సహకరించారని మంత్రి గుర్తుచేశారు. “రెండు రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలని చంద్రబాబు ఎప్పుడూ చెప్పారు. ఆయన ఎప్పటికీ తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలనే ఉద్దేశంతో ప్రవర్తించలేదు,” అని స్పష్టం చేశారు.

సీతారాం సాగర్‌కు ఆలస్యంగా అనుమతులు

“సీతారాం సాగర్ లిఫ్ట్ ప్రాజెక్టుకు ఇటీవలే అనుమతి ఇచ్చారు. కానీ అప్పటికే 75 శాతం పనులు పూర్తయ్యాయి. కనుక అనుమతి ప్రక్రియల్లో ఆలస్యం సహజం. బనకచర్లకు కూడా అదే తరహాలో అనుమతులు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాం,” అని మంత్రి నిమ్మల వివరించారు.

Read More : కువైట్‌లో చిత్రహింసలకు గురైన ఏపీ మహిళ…

One thought on “బనకచర్ల ప్రాజెక్టు నిజాలు: మంత్రి నిమ్మల

Comments are closed.