SLBC టన్నెల్‌లో మిషన్ రోబో: రెస్క్యూ ఆపరేషన్‌లో కొత్త దశ

tunnel robo

SLBC టన్నెల్‌లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌లో మంగళవారం నుంచి రోబోలు కూడా రంగంలోకి దిగాయి. హైదరాబాద్‌కు చెందిన అన్వీ రోబోటిక్ బృందం రూపొందించిన రోబోను తొలుత డెమో కోసం ఉపయోగించారు. ఈ రోబోను టన్నెల్‌లో ఎలా ఉపయోగించాలో రెస్క్యూ సిబ్బందికి ప్రాక్టికల్‌గా చూపించనున్నారు. డెమో విజయవంతం అయితే మరో రెండు రోబోలను కూడా రంగంలోకి దింపుతామని అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఐఐటీ మద్రాస్‌ ప్రొఫెసర్‌తో పాటు హైదరాబాద్‌ అన్వీ రోబోటిక్‌ టీమ్‌ భాగస్వామ్యమవుతోంది.

SLBC టన్నెల్‌లో గల్లంతైన ఏడుగురు కార్మికుల ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. కేరళ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన రెండు క్యాడవర్ డాగ్స్ మృతదేహాల ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రాంతంలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతంలోనే మిగిలిన మృతదేహాలు కూడా ఉండే అవకాశముందని రెస్క్యూ టీమ్‌ భావిస్తోంది.

ఇప్పటికే ఈ ఆపరేషన్ కోసం 11 ఏజెన్సీల సిబ్బంది షిఫ్ట్‌ల వారీగా పని చేస్తున్నారు. ఇక రోబోలను రంగంలోకి దింపడం ద్వారా మరింత సమర్థవంతంగా ఆపరేషన్ సాగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

SLBC టన్నెల్‌లో నీరు, బురదతోపాటు అనేక అవాంతరాలు తలెత్తుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీ అన్వీ రోబోటిక్‌ నిపుణుల సహాయంతో ఈ ఆపరేషన్‌ చేపట్టింది. ఈ ప్రాజెక్ట్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

ఇప్పటికే టన్నెల్‌లో మినీ జేసీబీల సహాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ పనితీరు మెరుగుపడినప్పటికీ, TBM మిషన్ ముందుభాగం పూర్తిగా బురదలో కూరుకుపోయినట్లు రెస్క్యూ టీమ్ తెలిపింది. TBM మిషన్ వెనుక భాగం శకలాలను తొలగించే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది.

గల్లంతైన వారిలో ఒక్కరి మృతదేహమే బయటపడటంతో మిగిలిన ఏడుగురి కోసం రెస్క్యూ సిబ్బంది నిరంతరం కృషి కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో రోబోలు ఆపరేషన్‌కు మరింత మద్దతుగా నిలవాలని అధికారులు ఆశిస్తున్నారు.

Read More

One thought on “SLBC టన్నెల్‌లో మిషన్ రోబో: రెస్క్యూ ఆపరేషన్‌లో కొత్త దశ

Comments are closed.