రాష్ట్రంలో మరోసారి పరువుహత్య కలకలం రేపింది. కులాంతర వివాహం చేసుకుందన్న కారణంగా, సొంత అక్కనే ఓ తమ్ముడు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన పోలీసు వర్గాలను కూడా ఉలిక్కిపడేలా చేసింది. ప్రేమవివాహం చేసుకున్న జంటలు సాధారణంగా కుటుంబ సభ్యుల మద్దతు లేకపోతే పోలీసులను ఆశ్రయిస్తారు. అయితే, ఈసారి ప్రేమపెళ్లి చేసుకున్న ఓ లేడీ కానిస్టేబుల్‌ను ఆమె తమ్ముడే హత్య చేయడం చర్చనీయాంశమైంది.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్‌కు చెందిన నాగమణి హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో లేడీ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోంది. నెలరోజుల క్రితం ఆమె తనకు ఇష్టమైన వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఈ పెళ్లిని నాగమణి కుటుంబసభ్యులు వ్యతిరేకించారు. అయినా, ఆమె వారి అభ్యంతరాలను పక్కనబెట్టి కులాంతర వివాహం చేసుకుంది.
ఇది కుటుంబంలో కోపానికి కారణమైంది. నాగమణి తమ్ముడు పరమేష్ ఆమెను చంపేందుకు సంకల్పించాడు. సోమవారం, రాయపోల్ నుంచి హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళుతున్న నాగమణిపై దాడి చేశాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఆమెను మన్యగూడ రహదారిపై కారుతో ఢీకొట్టాడు. ఆమె కిందపడిన వెంటనే కారు నుంచి దిగిన పరమేష్ కత్తితో దాడి చేసి ఆమెను హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.
