తెలంగాణలో రాజకీయ వేడి రోజు రోజుకూ పెరుగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఉధృతంగా సాగుతున్న జల వివాదం ఇప్పుడు చేపల పులుసు రాజకీయం వరకు విస్తరించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది.
రాష్ట్ర విభజన తర్వాత నీటి పంపకాల అంశం పదేపదే చర్చకు వస్తోంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణలో గత పాలన సక్రమంగా సాగి ఉంటే ఇప్పుడు ఇలాంటి సమస్యలు వచ్చేవి కావని వ్యాఖ్యలు చేశారు. దీనికి హరీష్ రావు కౌంటర్ ఇస్తూ ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అని విమర్శించారు.
పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్‌పై కేసీఆర్, జగన్ కలిసి నాటకాలు ఆడారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, నగరిలో రోజా ఇంటికి వెళ్లిన కేసీఆర్ చేపల పులుసు తిన్న విషయం ప్రస్తావిస్తూ, అప్పట్లో ఆయన రాయలసీమను రత్నాల సీమగా చేస్తానని చెప్పారని గుర్తుచేశారు.
దీనిపై హరీష్ రావు స్పందిస్తూ, కృష్ణా నీళ్లు తరలించుకుంటున్నప్పుడు చంద్రబాబును ప్రజాభవన్‌కు పిలిచి ఆయన అడుగుల వద్ద మడుగులు ఒత్తింది రేవంత్ రెడ్డి కాదా అని నిలదీశారు. అంతేగాక, మంత్రి ఉత్తమ్ దంపతులు చంద్రబాబు ఇంటికి వెళ్లి చేపల పులుసు తిన్న విషయాన్ని ప్రస్తావించారు.
సందర్భం ఏదైనా, ‘చేపల పులుసు’ అనే మాట తెలంగాణ రాజకీయాల్లో ఎప్పటికప్పుడు దుమారం రేపుతోంది. ఈ రాజకీయ చేపల పులుసు రుచి ఇంకెంత ఘాటుగా మారుతుందో చూడాలి.

3 thoughts on “తెలంగాణ రాజకీయాలను తాకుతున్న ‘చేపల పులుసు’ వివాదం”
Comments are closed.