తమిళ, తెలుగు చిత్రసీమల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు బాబీ సింహా, అసలుగా తెలుగువాడు. కృష్ణా జిల్లా మోపిదేవిలో తన బాల్యాన్ని గడిపిన ఆయన, తాజాగా తన పూర్వ విద్యాసంస్థకు వెళ్లి గురువును కలసి భావోద్వేగానికి గురయ్యాడు.
ప్రముఖ నటుడు బాబీ సింహా తమిళ చిత్రసీమలో స్టార్ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నా, ఆయనకు తెలుగు మూలాలు ఉన్నాయి. కృష్ణా జిల్లా మోపిదేవిలో ప్రాథమిక విద్యను అభ్యసించిన బాబీ, అనంతరం తండ్రి ఉద్యోగరీత్యా తమిళనాడుకు వెళ్లాడు. చిన్ననాటి నుంచే నటనపై ఆసక్తి కలిగిన ఆయన, సినీ పరిశ్రమలో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగాడు. జిగర్తాండ’ చిత్రంలో తన ప్రతిభావంతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించి, ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్నాడు.
ఇటీవల మోపిదేవి వెళ్లిన బాబీ సింహా, తన స్కూల్ టీచర్ నర్రా రాంబాబును కలిశాడు. బాల్యస్మృతులను గుర్తు చేసుకుంటూ ఎమోషన్ అయిన ఆయన, తన జీవితానికి మార్గదర్శకత్వం ఇచ్చిన గురువును తలచుకుని సంతోషం వ్యక్తం చేశాడు. తల్లిదండ్రుల తర్వాత గురువులే మనకు నిజమైన మార్గదర్శకులని, జీవితాన్ని తీర్చిదిద్దడంలో వారిదే కీలక పాత్ర అని ఆయన పేర్కొన్నాడు.
తమిళంతో పాటు తెలుగు చిత్రాల్లోనూ నటించిన బాబీ సింహా, నటి రశ్మీ మీనన్‌ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. అంతేకాదు, తెలుగు సినీ నటి పసుపులేటి రేష్మా, బాబీ సింహాకు సోదరి కావడం విశేషం.

One thought on “గురువును కలసి భావోద్వేగమైన బాబీ సింహా”
Comments are closed.