గచ్చిబౌలి భూములపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

హైదరాబాద్, ఏప్రిల్ 03: కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై గురువారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ భూముల రక్షణకు పలు పిటిషన్లు దాఖలవగా, పిటిషనర్ల తరఫున న్యాయవాదులు అభిషేక్ సంఘ్వీ, నిరంజన్ రెడ్డి తమ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది. అంతేకాకుండా, 7వ తేదీ వరకు హెచ్‌సీయూ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని, చెట్లను తొలగించరాదని స్టే విధించింది.

హైకోర్టు ఆదేశాల తర్వాత కూడా చెట్ల కొట్టివేత?

విచారణ సందర్భంగా, సుప్రీంకోర్టులోనూ ఈ అంశంపై విచారణ కొనసాగుతోందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే, హైకోర్టు ప్రొసీడింగ్స్‌పై సుప్రీంకోర్టు ఎలాంటి స్టే విధించలేదని ధర్మాసనం స్పష్టం చేసింది. మరోవైపు, బుధవారం నాడు హైకోర్టు చెట్ల తొలగింపును ఆపాలని చెప్పినప్పటికీ, గురువారం ఉదయం వరకు పనులు కొనసాగాయని న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టుకు వివరించారు.

విద్యార్థులు చెట్ల తొలగింపు దృశ్యాలను వీడియో తీస్తుండగా, వారిని అరెస్ట్ చేసి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో, హైకోర్టు ఏప్రిల్ 7వ తేదీ వరకు చెట్లను తొలగించరాదని స్పష్టం చేస్తూ, ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

400 ఎకరాల భూముల అమ్మకంపై వివాదం

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూములను అమ్మేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రక్రియలో భాగంగా, అక్కడి చెట్లను తొలగించి భూమిని చదును చేసే పనులు వేగవంతం చేసింది. అయితే, ఇది యూనివర్సిటీ భూమి అని, ఇక్కడ అనేక రకాల వన్యమృగాలు, పచ్చటి అడవి ఉన్నాయని విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

పర్యావరణ పరిరక్షణ కోసం విద్యార్థులు నిరసన తెలుపుతుండగా, ప్రభుత్వం వెనక్కు తగ్గకపోగా, బుల్డోజర్లతో చెట్ల తొలగింపును కొనసాగిస్తోంది. నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో మరింత ఆసక్తికరంగా మారింది. హైకోర్టు, సుప్రీంకోర్టు దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటాయనేది ఉత్కంఠగా మారింది.