రెడ్ బుక్ పేరిట వైసీపీ నాయకుల్లో భయాందోళనలు..

రెడ్ బుక్ పేరు చెప్పగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడుతున్నారని మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. ఇప్పటికే ఒకరు గుండెపోటుతో ఆసుపత్రిలో చేరగా, మరొకరు బాత్రూంలో జారి చేతిని విరగ్గొట్టుకున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికే రెడ్ బుక్ వర్తిస్తుందని స్పష్టం చేశారు.

రాజారెడ్డి రాజ్యాంగం కాదు – అంబేద్కర్ రాజ్యాంగమే న్యాయం

మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లిలో నిరుపేద కుటుంబానికి శాశ్వత పత్రాలను అందించిన అనంతరం విలేకరులతో మాట్లాడిన లోకేశ్, గత వైసీపీ ప్రభుత్వం రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేసిందని, తాము అంబేద్కర్ రాజ్యాంగాన్ని పాటిస్తున్నామని తెలిపారు. ప్రతిపక్ష నేత ఇంటి గేటుకు తాళం వేయడం, తప్పుడు కేసులు పెట్టడం తమ విధానం కాదని స్పష్టం చేశారు.

కరవు ప్రాంతాల్లో పరిశ్రమలు అభివృద్ధి – వైసీపీకి కడుపుమంట ఎందుకు?

కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో వలసలు తగ్గించేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని లోకేశ్ తెలిపారు. యువగళం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు కనిగిరిలో రిలయన్స్ సీబీజీ ప్లాంట్‌ను ప్రారంభించామని చెప్పారు. అక్కడ 50,000 ఎకరాల భూమిని రైతులు ప్రాజెక్టుల కోసం అందించేందుకు సిద్ధంగా ఉన్నారని, రిలయన్స్ కూడా 50 ప్లాంట్లు ఏర్పాటుచేయనున్నట్లు హామీ ఇచ్చిందని వెల్లడించారు.

ఇలాంటి పరిశ్రమలు తెచ్చి యువతకు ఉపాధి కల్పిస్తుంటే వైసీపీ నాయకులకు ఎందుకింత కడుపుమంట వచ్చిందని ప్రశ్నించారు. అభివృద్ధిని అడ్డుకునే విధంగా తప్పుడు ప్రచారం చేస్తుండటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. అందుకే రెడ్ బుక్‌లో అటువంటి తప్పుడు ప్రచారం చేసే వారిని చేర్చుతున్నానని స్పష్టం చేశారు.

జగన్‌కు ప్రజలను కలిసే తీరిక కూడా లేకపోయిందా?

తన కుటుంబ సభ్యులకే న్యాయం చేయలేని వ్యక్తి ప్రజల కోసం ఏమి చేయగలడని లోకేశ్ ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ ప్రజలను కలవలేదని, ప్రతిపక్షంలోకి వెళ్లిన తర్వాత కూడా కార్యకర్తలతో భేటీ అయ్యే సమయం కేటాయించలేదని విమర్శించారు. ప్రజా సమస్యలను పట్టించుకోవాల్సిన స్థాయిలో ఆయనకు బాధ్యత లేదని ఆరోపించారు.

ప్రజాసమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి ఉంటే, ఐదేళ్ల పాటు నివసించిన ప్రాంతంలోనే సమస్యలను ఎందుకు పరిష్కరించలేకపోయారని నిలదీశారు. పైగా తన ఇంటి దారి కోసం పేదల ఇళ్లు కూల్చివేశారని ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమంలో పోటీపడలేక, కులం, మతం, ప్రాంతం పేరుతో విద్వేషాలు సృష్టించే కుట్రలకు వైసీపీ పాల్పడుతోందని మండిపడ్డారు.

పాస్టర్ ప్రవీణ్ మరణం విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, ఈ కేసును ప్రభుత్వం పారదర్శకంగా దర్యాప్తు చేస్తోందని తెలిపారు. ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తే లేదని నారా లోకేశ్ స్పష్టం చేశారు.

Read More : మంగళగిరి అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన

One thought on “రెడ్ బుక్ పేరిట వైసీపీ నాయకుల్లో భయాందోళనలు..

Comments are closed.