హైదరాబాద్‌లో భారీ వర్షం: వాతావరణంలో ఒక్కసారిగా మార్పు

నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గత కొన్ని రోజులుగా ఎండ, ఉక్కపోతతో ఇబ్బంది పడిన హైదరాబాద్ వాసులకు మంగళవారం మధ్యాహ్నం నుంచి చల్లదనాన్ని తెచ్చిన వర్షం కొంత ఉపశమనం కలిగించింది. గ్రేటర్ హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది.

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బషీర్‌బాగ్, సైఫాబాద్, అబిడ్స్, కోఠి, కూకట్‌పల్లి, బోరబండ, మధురానగర్, అమీర్‌పేట, సనత్‌నగర్, ఖైరతాబాద్, పంజాగుట్ట, హిమాయత్‌నగర్, ముషీరాబాద్, గాంధీనగర్, నాచారం, మేడ్చల్, కండ్లకోయ, దుండిగల్, గండిమైసమ్మ, బహదూర్‌పల్లి, గాగిల్లాపూర్ తదితర ప్రాంతాల్లో గంటకు పైగా వర్షం కురుస్తోంది. వర్షం రాకతో రోడ్లు జలమయమయ్యాయి.

తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు

అటు తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు పడుతున్నాయి. సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరు, రామచంద్రాపురం, బీహెచ్‌ఈఎల్, పారిశ్రామికవాడ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. రహదారులన్నీ జలమయమయ్యాయి. నిజామాబాద్, వర్ని, బాన్సువాడ, బీర్కూర్, దర్పల్లి, సిరికొండ మండలాల్లో ఓ మోస్తరు వర్షాలు పడుతున్నాయి.

రైతులకు కొత్త సమస్య

అకాల వర్షాలతో కోత దశలో ఉన్న వరి పంట నేలరాలింది. ధాన్యం గింజలు ఊడి పోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బాన్సువాడ, వర్ని, దర్పల్లి ప్రాంతాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.

ఇంకా రెండు రోజులు వర్షాలు

భూ ఉపరితల వేడి పెరగడం, ద్రోణి ప్రభావంతో వచ్చే రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వర్షం ధాటికి హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ తీవ్రంగా నిలిచిపోయింది. వాహనదారులు నెమ్మదిగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎండ వేధింపుల నుంచి ప్రజలకు కొంతవరకు ఉపశమనం లభించనుంది.

Read More : గచ్చిబౌలి భూములపై హైకోర్టు కీలక ఉత్తర్వులు