బీఆర్‌ఎస్‌ స్ట్రాటజీ మారిందా? అసెంబ్లీకి కేసీఆర్‌ రానున్నారా?

KCR

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ మరోసారి రాజకీయ రంగంలోకి దిగారు. పార్టీ 25వ వార్షికోత్సవం సందర్భంగా ఏప్రిల్‌ 17న వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఫామ్‌హౌస్‌ రాజకీయాల నుంచి ప్రజల్లోకి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలకు హాజరవుతారా? లేదా? అనేదానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది.

బుధవారం అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభంకానుండగా, మంగళవారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించడం, వ్యూహాలను సిద్ధం చేయడం కోసం పార్టీ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. అసెంబ్లీకి హాజరవుతారన్న సంకేతాలు వస్తుండగా, బీఆర్‌ఎస్‌ నేతలు ఈ మేరకు అంచనాలు వేస్తున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలు – బీఆర్‌ఎస్‌ వ్యూహం

టీచర్స్‌, గ్రాడ్యూయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్న బీఆర్‌ఎస్‌, ఎమ్మెల్యే కోటా ఎన్నికలపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం సభలో బీఆర్‌ఎస్‌ బలం ప్రకారం ఒక సీటు గెలిచే అవకాశముంది. అయితే, రెండో అభ్యర్థిని నిలబెడితే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హెచ్చరికగా మారుతుందా? అనర్హత వేటు అంశాన్ని మళ్లీ చర్చకు తెచ్చేందుకు ఇదే వ్యూహమా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

కేసీఆర్‌ తన మార్క్‌ రాజకీయాలను మరోసారి చూపుతూ, ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రావణ్‌కుమార్‌ పేరును ఖరారు చేశారు. అసెంబ్లీలో రుణమాఫీ, బీసీ రిజర్వేషన్లు, కాళేశ్వరం ప్రాజెక్ట్‌, రాష్ట్ర అప్పులు వంటి కీలక అంశాలపై దళిత బహుజన వ్యూహంతో ముందుకెళ్తారా? ఉద్యమ శైలిలో దూకుడుగా వ్యవహరిస్తారా? అన్నదానిపై స్పష్టత రానున్న బీఆర్‌ఎస్‌ ఎల్పీ భేటీ కీలకంగా మారింది.

Read More