క్యూఆర్ కోడ్‌తో ప్రజల స్పందన, ఇంటికే సరుకులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆహార, పౌరసరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రేషన్ పంపిణీ వ్యవస్థలో పలు కీలక సంస్కరణలు చేపట్టినట్టు ఆయన వెల్లడించారు.

ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని రేషన్ డిపోల వద్ద క్యూఆర్ కోడ్ పోస్టర్లను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. రేషన్ కార్డుదారులు తమ మొబైల్ ఫోన్లలో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఓ వెబ్ ఫారమ్‌లోకి ప్రవేశించి, తమ ఫీడ్‌బ్యాక్ ఇవ్వవచ్చని చెప్పారు. అందులో రేషన్ సరుకులు అందాయా?, నాణ్యత, తూకం, డీలర్ ప్రవర్తన తదితర అంశాలపై “అవును” లేదా “కాదు” అనే ఎంపికలతో స్పందించవచ్చని వివరించారు. ప్రజల అభిప్రాయాలు నేరుగా అధికారులకు చేరుతాయని, తక్షణమే చర్యలు తీసుకోవచ్చని చెప్పారు.

వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేకంగా ఇంటికే సరుకులు

65 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటికే రేషన్ సరుకులు పంపిణీ చేసే పథకాన్ని ఇవాళ్టి నుంచే అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. వారికి ఐదు రోజుల ముందుగానే సరుకులు అందజేస్తామని పేర్కొన్నారు. జూలై నెల రేషన్ సరుకుల పంపిణీ నేటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైందని వివరించారు.

ఇంటింటి పంపిణీకి బదులుగా ప్రస్తుతం డిపోల ద్వారా అందిస్తున్న విధానం మెరుగైన ఫలితాలు ఇస్తోందని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రజల సహకారంతో సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు. “ప్రజల అభిప్రాయాలే మాకు మార్గదర్శకం” అంటూ నూతన వ్యవస్థలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం పారదర్శకంగా, నాణ్యంగా సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.

Read More : శ్రీకాకుళం జిల్లాలో భూతలానికి మేఘం?

One thought on “క్యూఆర్ కోడ్‌తో ప్రజల స్పందన, ఇంటికే సరుకులు

Comments are closed.