ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని జగన్ సమర్థిస్తున్నారా? అని ప్రశ్నించారు. తప్పు చేసిన నేతలపై చర్యలు తీసుకోవాల్సిన బదులు వారిని ప్రోత్సహించడం తగదని మండిపడ్డారు. మహిళలపై విరుచుకుపడే ధోరణికి జగన్ ప్రోత్సాహం ఇస్తున్నారని విమర్శించారు. నాయకుడే రెచ్చగొడితే కింది స్థాయి నేతలు ఇష్టానుసారం మాట్లాడతారని నిలదీశారు.
జగన్ అండ్ కోలాంటి వ్యక్తులు రాజకీయాలకు అవసరమా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్ర శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే “తోక కట్ చేస్తా” అని హెచ్చరించారు. ఇటీవల బంగారుపాళ్యంలో జరిగిన జగన్ పర్యటన దృశ్యాలను నెల్లూరులో పర్యటనలా చూపించారని విమర్శించారు. వైసీపీ నేతలు వితండవాదంలో ఎప్పుడూ ముందుంటారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ జరుగుతోందని హెచ్చరించారు.
కడప జిల్లా జమ్మలమడుగులో పర్యటించిన చంద్రబాబు, గూడెంచెరువులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామం నుంచి ప్రజావేదిక వేదికకు ఆటోలో ప్రయాణించి ఆటో డ్రైవర్‌కు బాడుగ చెల్లించారు. ఆ తరువాత గూడెంచెరువులో ప్రజా వేదిక బహిరంగ సభలో ప్రసంగించారు.
ఎన్టీఆర్ ఆలోచనతోనే రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయని గుర్తుచేసిన సీఎం చంద్రబాబు, రూ.3,800 కోట్లతో హంద్రీనీవా పనులు చేపట్టామని తెలిపారు. త్వరలోనే చెరువులన్నీ నింపేలా పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. సముద్రంలోకి వెళ్లే నీటిని వినియోగిస్తే కరవు సమస్య ఉండదని చెప్పారు. రాయలసీమలో పరిశ్రమలు అవసరమని పేర్కొంటూ, కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. 2028 డిసెంబర్ నాటికి స్టీల్ ప్లాంట్ తొలి దశ పనులు పూర్తవుతాయని వెల్లడించారు.
అలాగే రేపటి నుంచి అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు, కేంద్రం రూ.6 వేలు చెల్లించి రైతులకు మొత్తం రూ.20 వేలు అందజేస్తుందని తెలిపారు. ఈ సమావేశానికి మంత్రి సవిత, టీడీపీ ఎమ్మెల్యేలు, పలు వర్గాల నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Read More : జమ్మలమడుగులో ఆటోలో ప్రయాణించిన సీఎం

One thought on “మహిళలపై వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు”
Comments are closed.