తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, హామీలపై కీలక చర్చలు జరిగాయి. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రజాభవన్‌లో జరిగిన అఖిలపక్ష ఎంపీల సమావేశంలో ప్రధానంగా హైదరాబాద్ మెట్రో రెండో దశ, మూసీ రివర్ అభివృద్ధి ప్రాజెక్ట్, ఇతర ప్రధాన సమస్యలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎంపీలు 28 కీలక అంశాలను ప్రస్తావిస్తూ కేంద్రానికి పంపేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
ఈ సమావేశానికి ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ ఎంపీలు హాజరవగా, బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు గైర్హాజరయ్యారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లను ప్రత్యేకంగా ఆహ్వానించినప్పటికీ, షెడ్యూల్ సమస్యల వల్ల హాజరుకాలేకపోయారు.
ప్రధానంగా చర్చించిన అంశాలు:
- హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ
- మూసీ నదీ అభివృద్ధి ప్రాజెక్ట్
- బేపు ఘాట్‌ను గాంధీ సరోవర్‌గా అభివృద్ధి
- గోదావరి-మూసీ నదీ లింక్ ప్రాజెక్ట్
- వరంగల్ భూగర్భ డ్రైనేజీ ప్రణాళిక
- ఎస్‌సీసీఎల్ కోసం బొగ్గు బ్లాకుల కేటాయింపు
- తాడిచెర్ల బొగ్గు బ్లాక్-II మైనింగ్ లీజు
- రాష్ట్ర రైల్వే కనెక్టివిటీ విస్తరణ
- ఖమ్మంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు
- పీఎం మిత్రా పార్క్ కింద కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు
తెలంగాణ రాష్ట్రం కోసం కేంద్రం నెరవేర్చాల్సిన హామీలు, పెండింగ్ నిధుల విడుదల కోసం ఎంపీలు కట్టుబడి ఉన్నారని, మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు త్వరలో మరో సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అధికార ప్రతినిధులు తెలిపారు.

One thought on “తెలంగాణ ఎంపీల అత్యవసర సమావేశం – మెట్రో రెండో దశ, మూసీ అభివృద్ధిపై కీలక నిర్ణయాలు”
Comments are closed.