డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ఈ బడ్జెట్ సంక్షేమం, సుస్థిర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రూపొందించిందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో రెవెన్యూ లోటును తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసిందని విమర్శించారు. కొత్త బడ్జెట్ రాష్ట్రంలోని అన్ని వర్గాలకు భరోసా కల్పించేలా రూపొందించబడిందని, మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేశారని పేర్కొన్నారు. ప్రాధాన్యతల మేరకు అన్ని శాఖలకు తగిన కేటాయింపులు పెంచినట్లు తెలిపారు. ముఖ్యంగా మూలధన వ్యయాన్ని రూ.40,636 కోట్లకు పెంచడం ద్వారా మౌలిక వసతుల విస్తరణకు ప్రణాళిక సిద్ధం చేశామని వివరించారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తోందని, అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు పవన్ కల్యాణ్ చెప్పారు. అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు.
సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ రూపొందించిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌తో పాటు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడిని అభినందిస్తున్నట్లు తెలిపారు. బడ్జెట్ రూపకల్పనలో పాల్గొన్న ఆర్థిక, ప్రణాళిక, వ్యవసాయ శాఖల అధికారుల కృషిని ప్రశంసించారు.
రాష్ట్రంలో కొత్త మార్పులు రావడానికి ఈ బడ్జెట్ దోహదపడుతుందని, ప్రజలకు ప్రగతి మార్గాన్ని అందించేందుకు ఇది కీలకంగా మారుతుందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.

One thought on “ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందన”
Comments are closed.