భారత ప్రధాని నరేంద్ర మోదీపై పుతిన్ ప్రగాఢ అనుబంధ వ్యాఖ్యలు

ఇంటర్నెటెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీతో తన అనుబంధం గురించి పుతిన్

భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తనకు ఎంతో సన్నిహితమైన మిత్రుడని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin) వెల్లడించారు. ప్రపంచ నేతల్లో తనకు ఉన్న స్నేహితుల్లో ప్రధాని మోదీ ఒకరని అన్నారు. ఇటీవల జరిగిన వార్షిక విలేకరుల సమావేశంలో భాగంగా పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఆసక్తికరమైన ప్రశ్న ఒకటి ఎదురైంది. “ప్రపంచ నేతల్లో ఎవరితో కలిసి కప్ టీ షేర్ చేసుకోవాలని అనుకుంటారు?” అని అడిగిన ప్రశ్నకు పుతిన్ సమాధానం ఇస్తూ, తన స్నేహితుల గురించి వివరించారు. “జర్మనీ మాజీ ఛాన్సలర్ హెల్ముట్ కోల్, ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు జాక్వెస్ చిరాక్, ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీతో నాకు మంచి అనుబంధం ఉంది. అలాగే ఆసియాలో భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నాకు మిత్రులు” అని పేర్కొన్నారు.

బ్రిక్స్ గ్రూప్‌పై పుతిన్ వ్యాఖ్యలు
బ్రిక్స్ (BRICS) గ్రూప్ గురించి పశ్చిమ దేశాలు వ్యక్తం చేస్తున్న ఆందోళనలపై పుతిన్ తన అభిప్రాయాలను తెలిపారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ చేసిన వ్యాఖ్యలను ఉదహరించారు. “బ్రిక్స్ పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా పనిచేసే గ్రూప్ కాదు. అదే విధంగా ఏ ఇతర దేశానికి వ్యతిరేకం కూడా కాదు. ఇది సభ్య దేశాల ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తుంది” అని పుతిన్ పేర్కొన్నారు.

మోదీపై పుతిన్ ప్రశంసలు
భారత ప్రధాని మోదీతో తన స్నేహం గురించి పుతిన్ తరచుగా ప్రస్తావిస్తూ ఉంటారు. ఈ ఏడాది మోదీ రష్యాకు రెండుసార్లు వెళ్లారు. అక్టోబరులో జరిగిన బ్రిక్స్ సదస్సులో భారత్ యొక్క దౌత్య విధానాలను పునరుద్ఘాటించారు. యుద్ధానికి వ్యతిరేకంగా, చర్చలకు మద్దతు తెలుపుతున్న భారత్ వైఖరిని పుతిన్ ప్రశంసించారు.

ఇదిలాఉంటే, భారత ఆహ్వానం మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ 2025 ప్రారంభంలో భారత్‌లో పర్యటించనున్నారని క్రెమ్లిన్ వెల్లడించింది. ప్రతి ఏడాది ఒకసారి సమావేశం కావాలని ఇరువురు నేతలు అంగీకరించారని, ఈ క్రమంలో ఈసారి పుతిన్ భారత్‌ను సందర్శించనున్నారని వివరించారు.