హైదరాబాద్ నగర ఉత్తర ప్రాంత వాసులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నూతన సంవత్సర కానుక ఇచ్చారు. నార్త్‌సిటీకి త్వరలో మెట్రో రైలు సౌకర్యం కల్పించాలని ఆయన నిర్ణయించారు.
హైదరాబాద్ మెట్రో: మేడ్చల్.. శామీర్‌పేటకు మెట్రో!
పొడిగింపునకు సీఎం రేవంత్‌రెడ్డి గ్రీన్‌సిగ్నల్.. ఉత్తర ప్రాంతవాసులకు కొత్త సంవత్సర కానుక.
ప్యారడైజ్-మేడ్చల్, జేబీఎస్-శామీర్‌పేట.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్.
మూడు నెలల్లో డీపీఆర్.. హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి సీఎం రేవంత్ ఆదేశం.
ఫలించిన మేడ్చల్ మెట్రో సాధన సమితి పోరాటం.. ముఖ్యమంత్రి ప్రకటనపై హర్షం
హైదరాబాద్ సిటీ, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ నగర ఉత్తర ప్రాంత వాసులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నూతన సంవత్సర కానుక ఇచ్చారు. నార్త్‌సిటీకి త్వరలో మెట్రో రైలు సౌకర్యం కల్పించాలని ఆయన నిర్ణయించారు. ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు (23 కిలోమీటర్లు), జేబీఎస్ నుంచి శామీర్‌పేట్ వరకు (22 కిలోమీటర్లు) మెట్రోరైలును పొడిగించనున్నట్లు ప్రకటించారు. బుధవారం పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఏఎంఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో సమావేశమైన సీఎం.. ఈ మేరకు రెండు కారిడార్లకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఆయా కారిడార్లకు సంబంధించిన డీపీఆర్‌ను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే మెట్రో రెండో దశ విస్తరణకు నిర్ణయించిన ప్రభుత్వం.. పార్ట్-ఎ కింద ఆరు కారిడార్లను చేపట్టాలని నిర్ణయించారు.
తాజాగా నార్త్ సిటీకి సంబంధించి రెండు కారిడార్లను పార్ట్-బి కింద చేపట్టనుంది. వీటికి సంబంధించిన డీపీఆర్‌లను రూపొందించి కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపించాలని సీఎం సూచించారు. కాగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా ప్రాజెక్టును రూపొందించాలని సీఎం సూచించడంతో స్థానికులు సంతోషంగా ఉన్నారు. నగరంలో ప్రజా రవాణాలో అత్యంత కీలకమైన మెట్రో రైలు సౌకర్యానికి విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులను నివారించి, నిమిషాల వ్యవధిలో గమ్యస్థానాలకు చేరుకోవడం సహాయపడుతుంది.
ఈ క్రమంలో, మహానగరంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నార్త్‌సిటీకి మెట్రో రైలు అవసరమని స్థానికులు గట్టిగా కోరుతున్నారు. 2024 జనవరి 29న మేడ్చల్ మెట్రో సాధన సమితి పేరుతో ప్రత్యేక ఉద్యమం ప్రారంభించారు.
నార్త్ సిటీలో ఈ కారిడార్లకు డిమాండ్:
హైదరాబాద్‌కు ఉత్తర ప్రాంతంలో ఉన్న ప్యారడైజ్ నుంచి తాడ్‌బండ్-బోయిన్‌పల్లి పోలీ్‌సస్టేషన్-మిలిటరీ డెయిరీఫామ్ రోడ్డు-కొంపల్లి-మేడ్చల్ వరకు (22 కిలోమీటర్లు), జేబీఎస్ నుంచి శామీర్‌పేట్-తూముకుంట వరకు (19 కిలోమీటర్లు), తార్నాక నుంచి ఈసీఐఎల్-నాగారం-కీసర వరకు (20 కిలోమీటర్లు), బోయిన్‌పల్లి పోలీ్‌సస్టేషన్ నుంచి మూసాపేట్ వై జంక్షన్-బాలానగర్-సూరారం-గండిమైసమ్మ వరకు (21 కిలోమీటర్లు) మెట్రో కారిడార్లను నిర్మించాలని మేడ్చల్ మెట్రో సాధన సమితి సభ్యులు కోరుతున్నారు.
ప్రభుత్వ నిర్ణయంతో సంతోషం:
మెట్రో రెండో దశ విస్తరణలో భాగంగా, పార్ట్-ఎ లోని ఐదు కారిడార్లకు సంబంధించిన డీపీఆర్‌ను 2024 నవంబరు 4న రాష్ట్ర మంత్రివర్గం ఆమోదంతో హెచ్‌ఏఎంఎల్ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. ఈ డీపీఆర్‌కు మరో మూడు నెలల్లో గ్రీన్‌సిగ్నల్ లభించనున్నట్లు తెలుస్తోంది.
మిగతా రెండు కారిడార్లను చేర్చండి:
నార్త్‌సిటీ మెట్రోకు సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం తెలపడం చాలా సంతోషంగా ఉంది. మా ప్రాంతానికి మెట్రో రైలు కావాలని కొన్ని నెలలుగా పోరాటం చేస్తున్నాం. మా ఆకాంక్షను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని కొత్త సంవత్సరం రోజున గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం ఆనందంగా ఉంది. ప్యారడైజ్- మేడ్చల్, జేబీఎ్‌స-శామీర్‌పేట మాదిరిగానే తార్నాక-ఈసీఐఎల్-కీసరవరకు, బోయిన్‌పల్లి పోలీ్‌సస్టేషన్-గండిమైసమ్మ కారిడార్లను కూడా రెండో దశలోనే చేర్చాలి.
- మామిడి సంపత్‌రెడ్డి, మేడ్చల్ మెట్రోసాధన సమితి వ్యవస్థాపక సభ్యుడు.
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు స్వరూపం:
మొదటి దశ:
- కారిడార్-1 (ఎల్‌బీనగర్-మియాపూర్): 29 కిలోమీటర్లు
- కారిడార్-2 (జేబీఎ్‌స-ఎంజీబీఎస్): 11 కిలోమీటర్లు
- కారిడార్-3 (నాగోల్ – రాయదుర్గం): 29 కిలోమీటర్లు
రెండో దశ- పార్ట్-ఎ:
- ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట: 7.5 కిలోమీటర్లు
- నాగోల్-ఎల్‌బీనగర్-చాంద్రాయణగుట్ట: 36.4 కిలోమీటర్లు
- రాయదుర్గం – కోకాపేట నియోపోలిస్: 11.6 కిలోమీటర్లు
- మియాపూర్ – బీహెచ్‌ఈఎల్- పటాన్‌చెరు: 13.4 కిలోమీటర్లు
- ఎల్‌బీనగర్ – వనస్థలిపురం- హయత్‌నగర్: 7.1 కిలోమీటర్లు
- శంషాబాద్ ఎయిర్‌పోర్టు-ఓఆర్‌ఆర్: 40 కిలోమీటర్లు
రెండో దశ- పార్ట్-బి:
- ప్యారడైజ్- మేడ్చల్: 23 కిలోమీటర్లు
- జేబీఎస్ – శామీర్‌పేట: 22 కిలోమీటర్లు
కారిడార్ల నిర్మాణం:
రెండో దశలో, పార్ట్-బి కింద రెండు కారిడార్లను చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ప్యారడైజ్ మెట్రోస్టేషన్ నుండి మేడ్చల్ వరకు, జేబీఎస్ నుండి శామీర్‌పేట్ వరకు కారిడార్లు నిర్మించబడతాయి.
