అమెరికా భూభాగం నుంచే పాకిస్థాన్ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ భారత్‌పై అణు బెదిరింపులు చేయడం పెద్ద దుమారం రేపింది. ఈ వ్యాఖ్యలను ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. కేవలం విదేశాంగ శాఖ ప్రకటనతో సరిపెట్టకుండా, ఈ అంశాన్ని మోదీ ప్రభుత్వం అమెరికా వద్ద బలంగా ప్రస్తావించాలని ఆయన డిమాండ్ చేశారు.
మంగళవారం ‘ఎక్స్’ వేదికగా ఒవైసీ స్పందిస్తూ… “భారత్‌ను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు, బెదిరింపులు ఖండించదగినవి. అంతేకాకుండా, అమెరికా గడ్డపై ఇలాంటి మాటలు మాట్లాడటం మరింత దారుణం. దీనిపై మోదీ ప్రభుత్వం రాజకీయపరంగా స్పందించాలి. అమెరికా ప్రభుత్వానికి గట్టి నిరసన తెలియజేయాలి” అని అన్నారు.
అమెరికా మన వ్యూహాత్మక భాగస్వామి అని గుర్తుచేసిన ఒవైసీ, ఆ దేశ భూభాగాన్ని భారత్‌కు వ్యతిరేకంగా వాడుకోవడాన్ని అంగీకరించలేమని స్పష్టం చేశారు. పాకిస్థాన్ సైనిక కుట్రల దృష్ట్యా భారత సైన్యాన్ని మరింత ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని, రక్షణ రంగానికి కేటాయిస్తున్న బడ్జెట్ తగినంత కాదని ఆయన విమర్శించారు.
ఏం జరిగింది?
గత శనివారం అమెరికా ఫ్లోరిడా రాష్ట్రం, టాంపా నగరంలో పాకిస్థానీ ప్రవాసులతో జరిగిన ఒక ప్రైవేట్ డిన్నర్‌లో అసిమ్ మునీర్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “మేం (పాకిస్థాన్) అణుశక్తి దేశం. పతనమవుతున్నామనే పరిస్థితి వస్తే, మాతో పాటు సగం ప్రపంచాన్ని కూడా ముంచేస్తాం” అని ఆయన హెచ్చరించినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి.
భారత్ ఘాటుగా స్పందించింది
పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ ఘాటుగా స్పందించింది. పాకిస్థాన్ చేసే అణు బ్లాక్‌మెయిల్‌కు లొంగిపోమని స్పష్టం చేసింది. జాతీయ భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పింది.
విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ… “పాకిస్థాన్ నుంచి అణు బెదిరింపులు రావడం కొత్తేమీ కాదు. ఉగ్రవాద సంస్థలతో చేతులు కలిపిన దేశంలో అణ్వాయుధాల నియంత్రణ ఎంత బాధ్యతారాహిత్యంగా ఉందో అంతర్జాతీయ సమాజం గమనించాలి” అని వ్యాఖ్యానించారు.
Read More : మహారాష్ట్రలో 12 ఏళ్ల బాలికపై ఘోర దారుణం దేశాన్ని కుదిపిన ఘటన

One thought on “అమెరికా నుంచి పాక్ ఆర్మీ చీఫ్ అణు బెదిరింపులు .”
Comments are closed.