సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెరిగితే చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా మారుతారు. బ్రాండ్లు, కంపెనీలు వీరిని తమ ఉత్పత్తులు ప్రమోట్ చేయడానికి ఉపయోగిస్తాయి. అయితే ఇది మంచికోసమే జరిగితే సమస్య లేదు. కానీ లోకల్‌బాయ్ నానీ మాత్రం తన యూట్యూబ్ చానల్ ద్వారా బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేస్తూ, అమాయకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడు. దేశంలో బెట్టింగ్ చట్టపరంగా నేరం. పైగా, ఈ యాప్‌లను ప్రమోట్ చేసేటప్పుడు ఓ కొత్త స్టైల్లో డ్రామాలు క్రియేట్ చేయడం కూడా కనిపిస్తోంది.
అత్యాశ ఉన్నవారు, డబ్బు ఆశతో ఉంటే ఈ యాప్‌ల వలలో పడిపోతారు. గతంలో ఎంతోమంది యువతీయువకులు బెట్టింగ్ కారణంగా భారీగా నష్టపోయి చివరికి సూసైడ్ చేసుకున్న ఘటనలు కూడా నమోదయ్యాయి. అయినా, లోకల్‌బాయ్ నానీ లాంటి వ్యక్తులు ప్రొమోషన్ డబ్బు కోసం ఇలాంటి వీడియోలు చేయడాన్ని కొనసాగిస్తున్నారు.
తెలంగాణ ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి సజ్జనార్ గతంలోనే బెట్టింగ్ యాప్‌ల ప్రచారాన్ని తప్పుపట్టారు. సమాజానికి హానికరంగా మారుతున్నారని హెచ్చరించారు. తాజాగా, విశాఖపట్టణంలో నానీపై కేసు నమోదైంది. అతను బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్నందున AIYF యూత్ వింగ్, విశాఖ పోలీస్ కమిషనర్ శంకబత్ర బాగ్చీకి ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన అనంతరం నానీ చట్టాన్ని ఉల్లంఘించాడని పోలీసులు నిర్ధారించారు.
నానీ ప్రచారాలను పరిశీలించిన విశాఖ సీపీ శంకబత్ర బాగ్చీ, బెట్టింగ్ యాప్‌ల మోసపూరిత స్వభావాన్ని గుర్తించారు. అమాయక ప్రజలు ఇందులో ఇరుక్కుంటే తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు.
