తెలంగాణ రాష్ట్రంలో మార్చి 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) అధ్యక్షతన కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం మంగళవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్‌లో జరగనుంది.
ఈ భేటీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష (BRSLP) సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా శాసనసభలో పాటించాల్సిన వ్యూహాలు, మండలిలో అనుసరించాల్సిన విధానాలపై కేసీఆర్ సభ్యులకు స్పష్టమైన మార్గదర్శకాలు అందజేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఇరుకున పెట్టేందుకు ఎలాంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించాలనే విషయంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేసీఆర్ తొలి రోజు మాత్రమే అసెంబ్లీలో హాజరై, మీడియా పాయింట్ వద్ద మాట్లాడి వెళ్లిపోయారు. ఆ సమయంలో ఆయన తనదైన శైలిలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే ఈసారి మాత్రం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మొత్తానికి కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఇప్పటికే వెల్లడించారు.
కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడం, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం ద్వారా ఈ సెషన్ మరింత ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు దూసుకెళ్లే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

One thought on “తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధం: కేసీఆర్ అధ్యక్షతన కీలక భేటీ”
Comments are closed.