ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గుడ్ న్యూస్: మంత్రి పొంగులేటి ప్రకటన

indiramma illu

తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియను వారంలోగా పూర్తిచేస్తామని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో మూడు నుంచి నాలుగేళ్లలో పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు.

ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు తాము వడ్డీలు కట్టడానికే చాలా వరకు సొమ్ము వెచ్చిస్తున్నామని మంత్రి విమర్శించారు. అయినప్పటికీ, వడ్డీలు కడుతూనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కొత్త ప్రక్రియ
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేసి వారంలోగా పనులు ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. లబ్దిదారుల జాబితాలో పేర్లు లేకపోయిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, అర్హులైన లబ్దిదారులను అధికారుల ద్వారా మళ్లీ ఎంపిక చేస్తామని మంత్రి పొంగులేటి వివరించారు.

సీఎం రేవంత్ శంకుస్థాపన
తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు ఈ పథకాలను వేర్వేరు విధానంలో అమలు చేయాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 21న నారాయణపేట జిల్లా అప్పకపల్లెలో సీఎం రేవంత్ ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేశారు.

ఇందిరమ్మ ఇళ్ల తొలి విడత
ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద లబ్దిదారుల దరఖాస్తులు స్వీకరించగా, అర్హులైన లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశారు. తొలి విడతలో 72,045 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సబ్సిడీతో కూడిన ఆర్థిక సాయం అందించనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు.

Read More

One thought on “ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గుడ్ న్యూస్: మంత్రి పొంగులేటి ప్రకటన

Comments are closed.