తెలంగాణ ప్రముఖ విప్లవ కవి, వాగ్గేయకారుడు, దివంగత గద్దర్ సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గద్దర్ ఫౌండేషన్‌కు మూడు కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదముద్ర వేశారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, గద్దర్ భావజాలాన్ని పరిరక్షించడం, ఆయన ఆలోచనలు, సాంస్కృతిక విప్లవంపై పరిశోధనలను ప్రోత్సహించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ నిధులతో గద్దర్ ఫౌండేషన్ వివిధ కార్యక్రమాలను నిర్వహించనుంది. ముఖ్యంగా గద్దర్ స్ఫూర్తిని కొనసాగించే పరిశోధన కార్యక్రమాలు, ఆయన జయంతి ఉత్సవాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్మారక ప్రాజెక్టులకు ఈ సహాయం ఉపయోగపడనుంది.
తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పోషించిన పాత్ర అత్యంత కీలకమైనదిగా చరిత్రలో నిలిచిపోయింది. కుల వివక్ష, సామాజిక అన్యాయాలపై గళమెత్తిన గద్దర్ తన పాటలు, ప్రసంగాల ద్వారా సామాజిక చైతన్యాన్ని ప్రజల్లో రగిలించారు. 2023 ఆగస్టులో ఆయన మరణించినప్పటికీ, గద్దర్ ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో గద్దర్ స్మారక చిహ్నం ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ మూడు కోట్ల రూపాయల నిధుల కేటాయింపు ద్వారా సమానత్వం, న్యాయం, సాంస్కృతిక విలువలు భవిష్యత్ తరాలకు చేరవేయాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయంగా కనిపిస్తోంది. గద్దర్ పోరాట స్పూర్తిని అనంతరం తరాల వరకు సజీవంగా ఉంచేందుకు ఈ చర్య కీలకంగా మారనుంది.
Read More : CMతో తెలుగు సినీ ప్రముఖుల కీలక భేటీ

3 thoughts on “తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫౌండేషన్‌కు 3 కోట్ల ఆర్థిక సహాయం”
Comments are closed.