CMతో తెలుగు సినీ ప్రముఖుల కీలక భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు రేపు (ఆదివారం) కీలక సమావేశానికి సిద్ధమవుతున్నారు. సాయంత్రం 4 గంటలకు సినీ ప్రముఖులు సీఎం చంద్రబాబును కలవనున్నారు. ఈ సమావేశంలో తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన అనేక సమస్యలు, అవసరాలపై చర్చించనున్నట్టు సమాచారం.

ఈ భేటీకి ముందు, తెలుగు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో సినీ ప్రముఖులు మొదట భేటీ అవుతారు. అనంతరం పవన్ కల్యాణ్ తో కలిసి వారు చంద్రబాబు నివాసానికి చేరుకుంటారు. ఇటీవల పవన్ కళ్యాణ్… “చంద్రబాబు సీఎం అయ్యాక ఒక్కసారి అయినా కలిశారా?” అంటూ పరిశ్రమ ప్రముఖులను ప్రశ్నించిన సంగతి తెలిసిందే. థియేటర్‌ల పరిస్థితి, మూతపడిన థియేటర్ల సమస్యలపై పవన్ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ ఆదేశాల మేరకు అధికారులు రాష్ట్రంలోని పలు థియేటర్లలో తనిఖీలు నిర్వహించారు. రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్లైనా, ఏపీలో సినిమా నిర్మాణాలు పరిమితంగానే కొనసాగుతుండటంతో, పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకునే చర్యలు ఇప్పుడు ప్రధాన చర్చాంశంగా మారాయి. సీఎం చంద్రబాబు సూచన మేరకు మంత్రి కందుల దుర్గేష్ సినీ ప్రముఖులను ఫోన్ చేసి సమావేశానికి ఆహ్వానం పంపించారు. సమావేశానికి 35 నుంచి 40 మంది ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. అనంతరం ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నారు.

ఈ సమావేశానికి హాజరయ్యే ప్రముఖుల్లో దర్శకులు బోయపాటి శ్రీనివాస్, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి, నాగ అశ్విన్ ఉన్నారు. నిర్మాతల్లో అశ్వినీదత్, దిల్ రాజు, అల్లు అరవింద్, దానయ్య, కెవి రామారావు పాల్గొననున్నారు. నటుల్లో బాలకృష్ణ, వెంకటేశ్, మంచు మనోజ్, సుమన్, ఆర్. నారాయణమూర్తి, నాని హాజరవుతారు.

ఈ సమావేశం తెలుగు సినీ పరిశ్రమకు కీలక నిర్ణయాలకు దారితీసే అవకాశముందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Read More : దేవుడి దయ వల్ల క్షేమంగా బయటపడ్డా