తెలంగాణ ఆర్థిక పరిస్థితి దిగజారింది: మూలధన వ్యయానికి నిధులు లేవని సీఎం స్పష్టత

revanthreddy

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిన్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వెల్లడించారు. రాష్ట్ర ఆదాయంపై స్పష్టతనిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నెలకు తెలంగాణ రాష్ట్రం సుమారు రూ.18,500 కోట్ల ఆదాయాన్ని పొందుతుందని ఆయన తెలిపారు. అయితే, ఈ మొత్తం నుంచి రూ.6,500 కోట్లు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు వెళ్తాయని తెలిపారు. మరో రూ.6,500 కోట్లు అప్పు వడ్డీలు, రుణాల చెల్లింపులకు కేటాయించాల్సి వస్తుందని వివరించారు. మిగిలిన రూ.5,000 కోట్లను సంక్షేమ పథకాలు, ఇతర నిర్వహణ ఖర్చులకు వినియోగించాల్సి వస్తోందని తెలిపారు.

ఈ పరిస్థితుల్లో రాష్ట్ర అభివృద్ధి కోసం అవసరమైన మూలధన వ్యయానికి (Capital Expenditure) ఎలాంటి నిధులు మిగలడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అనేక అభివృద్ధి పనులు నిలిచిపోయిన పరిస్థితి నెలకొందని ఆయన వెల్లడించారు. ఈ పరిస్థితికి గత ప్రభుత్వ అక్రమ ఖర్చులు, అనవసర అప్పులు కారణమని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు మెరుగుపడేందుకు ప్రభుత్వమే పూర్తిస్థాయిలో కృషి చేస్తుందని సీఎం హామీ ఇచ్చారు.

Read More