తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి రేసులో తాను లేనని స్పష్టం చేసిన బండి సంజయ్

Bandi Sanjay

తెలంగాణ బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై నెలకొన్న ఊహాగానాలకు కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) తెరదించారు. గత కొద్దిరోజులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి తనకే దక్కుతుందనే ప్రచారం జరుగుతున్న తరుణంలో, తాను ఆ పదవికి పోటీదారిని కాదని స్పష్టంగా పేర్కొన్నారు. తాను రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఆసక్తి చూపటం లేదని, ఆ పదవిపై వస్తున్న వదంతులను నమ్మొద్దని ఆయన తెలిపారు.

ఇదిలా ఉండగా, పార్టీ నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియలో సోషల్ మీడియా వదంతులను అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తోందని బండి సంజయ్ వెల్లడించారు. అభ్యర్థిత్వంపై మీడియా ప్రచారాన్ని, నేతల వ్యక్తిగత ప్రచార ప్రయత్నాలను పార్టీ సీరియస్‌గా పరిశీలిస్తోందని స్పష్టం చేశారు.

డీలిమిటేషన్, స్టాలిన్ సమావేశంపై బండి సంజయ్ కౌంటర్

అదే సమయంలో, చెన్నైలో తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన జరిగిన డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల సమావేశాన్ని ఉద్దేశించి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సమావేశంలో అవినీతి కలుషిత నేతలే ఉన్నారని వ్యాఖ్యానించారు. “స్టాలిన్ సమావేశంలో ఉన్నవారంతా లిక్కర్ స్కామ్, ల్యాండ్ స్కామ్ ముఠాలకు చెందినవారే,” అని ఆరోపించారు. డీలిమిటేషన్‌పై తప్పుడు ప్రచారం చేస్తూ, దక్షిణాది ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో రైతులు పంట నష్టానికి పరిహారం పొందలేదని బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తయినా రైతులకు సరైన భరోసా ఇవ్వలేదని విమర్శించారు.

Read More : బీజేపీ కొత్త అధ్యక్షుడిపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు – పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు