డీలిమిటేషన్‌పై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు: దక్షిణాదిపై అన్యాయం అంగీకరించం

revanthreddy

జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్‌ను దక్షిణాది రాష్ట్రాలు అంగీకరించబోవన్న సంగతి స్పష్టం చేస్తూ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఫెయిర్ డిలిమిటేషన్ జేఏసీ సమావేశంలో మాట్లాడిన ఆయన, ఉత్తరాది రాష్ట్రాల డామినేషన్‌ను అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు అనుభవజ్ఞులైన నేతలు ఉన్నా, అభివృద్ధి పరంగా దక్షిణాది రాష్ట్రాలకంటే వెనుకబడి ఉన్నాయని రేవంత్ వివరించారు.

దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో:
రేవంత్ మాట్లాడుతూ, ఉద్యోగ, ఉపాధి కల్పన, జీడీపీ పెరుగుదల, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాల్లో దక్షిణాది రాష్ట్రాలు ఎప్పుడూ ముందంజలోనే ఉన్నాయని తెలిపారు. బీహార్ ఒక రూపాయి పన్ను కడితే ఆరు రూపాయలు కేంద్రం నుంచి పొందుతోందని, ఉత్తరప్రదేశ్ రూ.2.30 పైసలు పొందుతోందని వివరించారు. మరోవైపు, కర్ణాటక 26 పైసలు, తమిళనాడు 16 పైసలు, తెలంగాణ 42 పైసలు మాత్రమే పొందుతున్నాయి అని తెలిపారు. ఇది ప్రాంతీయ అసమానతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.

డీలిమిటేషన్‌లో మార్పులు అవసరం:
2026లో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) డీలిమిటేషన్‌ను అమలు చేయాలని చూస్తే, గతంలో ఇందిరా గాంధీ, అటల్ బిహారీ వాజ్‌పేయి (Indira Gandhi, Atal Bihari Vajpayee) అనుసరించిన మార్గాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ప్రస్తుత పార్లమెంట్ 534 స్థానాల్లో దక్షిణాది రాష్ట్రాలకు 130 సీట్లు మాత్రమే ఉన్నాయని, ఇది మొత్తం సీట్లలో 24 శాతమే అని అన్నారు. ఈ సంఖ్యను 33 శాతానికి పెంచాలని, దక్షిణాదికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

“డీలిమిటేషన్ రాష్ట్రాల అంతర్గతంగా ఉండాలి. మహిళా రిజర్వేషన్, ఇతర రిజర్వేషన్లు పక్కాగా అమలు అయ్యేలా చూడాలి” అని పేర్కొన్నారు. ఉత్తరాది హవా పెరిగేలా చేసే ప్రణాళికలను అంగీకరించేది లేదని, దక్షిణాది రాష్ట్రాలు కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన హితవు పలికారు.

Read More : డీలిమిటేషన్‌పై వైఎస్ జగన్, షర్మిల స్పందన – అన్యాయాన్ని తట్టుకోలేమంటూ షర్మిల హితవు