తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని రాజకీయ పార్టీలు, ఎంపీలు ఏకం కావాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజాభవన్‌లో జరిగిన అఖిలపక్ష ఎంపీల సమావేశంలో ఆయన పాల్గొని, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీల అంశాలపై విస్తృతంగా చర్చించామని తెలిపారు.
ఈ సందర్భంగా 28 ముఖ్యమైన అంశాలపై చర్చ సాగిందని భట్టి విక్రమార్క వివరించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయాలని ఇప్పటికే ప్రతిపాదనలు పంపించామని, మళ్లీ వాటిని సమర్పిస్తామని తెలిపారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులను ఆహ్వానించినప్పటికీ, బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు హాజరుకాలేదని ఆయన విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైనా, కాంగ్రెస్ ఒత్తిడి పెంచింది
భట్టి విక్రమార్క మాట్లాడుతూ, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంపై సరైన ఒత్తిడి తీసుకురాలేదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ హక్కుల కోసం కదిలామని తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల కోసం పార్లమెంట్లో ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన హితవు పలికారు. త్వరలో మరో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, ముందుగానే అన్ని పార్టీలకు సమాచారం అందజేస్తామని భట్టి స్పష్టం చేశారు.
తెలంగాణకు నిధుల కేటాయింపులో అన్యాయం: అసదుద్దీన్ ఓవైసీ
ఈ సమావేశంలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ, తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం లేదని, రాష్ట్రానికి రావాల్సిన నిధులు అడ్డుకట్టకు గురవుతున్నాయన్నారు. తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఆయన మండిపడ్డారు.
రాష్ట్రానికి రావాల్సిన హక్కులపై ప్రెజెంటేషన్
ఈ సమావేశంలో విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన హక్కులపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతీ ఒక్కరు ఏకం కావాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి పంపిన లేఖలు, అవసరమైన సమాచారం, డాక్యుమెంట్లను ఒక బుక్‌లెట్‌గా రూపొందించి ఎంపీలందరికీ పంపనున్నట్లు తెలిపారు.

One thought on “రాష్ట్ర హక్కుల కోసం ఏకతాటిపైకి రావాల్సిన అవసరం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క”
Comments are closed.