రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను సమగ్రంగా అమలు చేసే వరకు మాదిగ జాతి అప్రమత్తంగా ఉండాలని, ఈ అంశాన్ని ప్రజలకు వివరించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Mandakrishna Madiga) పిలుపునిచ్చారు. తమ న్యాయమైన హక్కులను సాధించేందుకు మరో ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు.
సోమవారం సికింద్రాబాద్ బాలంరాయిలోని డ్రీమ్‌ల్యాండ్ గార్డెన్‌లో జరిగిన ఎమ్మార్పీఎస్ & అనుబంధ సంఘాల సమావేశంలో మందకృష్ణ మాదిగ మాట్లాడారు. జస్టిస్ షమీమ్ అక్తర్ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఎస్సీ వర్గీకరణ నిర్ణయంలో శాస్త్రీయత, హేతుబద్ధత పూర్తిగా లోపించిందని ఆయన విమర్శించారు.
ఎస్సీ వర్గీకరణపై మండిపడ్డ మందకృష్ణ మాదిగ
- అన్ని కులాల్లో అసంతృప్తి నెలకొంది కాబట్టి, అందరికీ సమాన న్యాయం జరిగేలా ఎస్సీ వర్గీకరణను చట్టబద్ధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
- ఎస్సీలలో మిగతా 58 కులాలు ఎస్సీ వర్గీకరణను కోరుతున్నాయి, కానీ మాల కులం మాత్రం దీనికి వ్యతిరేకంగా ఉంది అని అన్నారు.
- రాష్ట్ర ప్రభుత్వం నివేదికను పూర్తిగా అధ్యయనం చేయకుండానే ఎస్సీ వర్గీకరణను ఆమోదించిందని మండిపడ్డారు.
సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు
ఈ సమావేశానికి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ అధ్యక్షత వహించగా, మాజీ ఎంపీ వెంకటేష్ నేత, బీసీ నేత డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్, సయ్యద్ ఇస్మాయిల్, హోలియా దాసరి రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్, ఎంఎ్‌సఎఫ్ జాతీయ అధికార ప్రతినిధి సోమశేఖర్, కొమ్ము శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
అశాస్త్రీయంగా చేపట్టిన వర్గీకరణలోని లోపాలను సవరించి, అన్ని వర్గాలకూ న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.
