అనంత వెంకటరామిరెడ్డికి టీడీపీ నేత వెంకటశివుడు యాదవ్ కౌంటర్

YCP vs TDP

అనంత వెంకటరామిరెడ్డికి టీడీపీ నేత వెంకటశివుడు యాదవ్ కౌంటర్

“మీ ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేశారనే కారణంతోనే ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్షంలోకి పంపారు. ఆ నిజాన్ని మరిచి, మళ్లీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేయడం ఇకనైనా మానుకోవాలి” అంటూ వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డిని టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు.

జగన్ భద్రత తగ్గించారని ఆరోపణలు చేయడం హాస్యాస్పదం అని పేర్కొన్నారు. శుక్రవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, “గుంటూరులో మిర్చి రైతులకు మద్దతు ధర లేదంటూ జగన్ రెడ్డి నిరసనకు వెళ్లడం విడ్డూరంగా ఉంది. అధికారంలో ఉన్నప్పుడూ రైతులకు ఏ మాత్రం మేలు చేయని ఆయన ఇప్పుడు సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారా?” అని ప్రశ్నించారు.

“ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా, దీన్ని తప్పనిసరి నిబంధనగా తెలిసే జగన్ ఎందుకు మిర్చి యార్డుకు వెళ్లారు? అక్కడ ఏం వెలగబెట్టారో ప్రజలకు చెప్పాలి” అని నిలదీశారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడే మిర్చి రైతులకు ఏదైనా సహాయం చేశారా? అని నిలదీశారు.

అంతేకాకుండా, “జగన్ మాజీ ముఖ్యమంత్రి మాత్రమే, ప్రస్తుతం ఆయనకు ఎమ్మెల్యే హోదా మాత్రమే ఉంది. ప్రోటోకాల్ ప్రకారం అవసరమైన భద్రత కల్పిస్తుంటాం. కానీ కావాలని ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపణలు చేయడం సరైన విధానం కాదు” అని వెంకటశివుడు యాదవ్ వ్యాఖ్యానించారు.

అమ్మఒడి పథకం గురించి కూడా స్పష్టత ఇచ్చిన ఆయన, “ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడానికి కొందరు స్కూల్ పిల్లలతో అబద్ధాలు చెప్పిస్తున్నారు. ప్రజలు అటువంటి మాటలను నమ్మే పరిస్థితిలో లేరు” అని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసానాయుడు, లీగల్ సెల్ నేత గాజుల ఆదెన్న, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గౌస్‌మొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

Read More