హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ‘కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరి’ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్‌పై ‘ఆపరేషన్ సిందూర్’కు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలిపిందని స్పష్టం చేసిన ఖర్గే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం ఆ యుద్ధాన్ని మధ్యలోనే నిలిపేశారని ఆరోపించారు. మణిపూర్‌లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలను ప్రస్తావించిన ఖర్గే, ఇప్పటివరకు 42 దేశాలు తిరిగిన ప్రధానికి మణిపూర్ వెళ్లే సమయం దొరకడం లేదన్నది దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మణిపూర్ భారతదేశంలో భాగం కాదా? అని నిలదీశారు. విదేశీ పర్యటనలకంటే ముందుగా దేశీయ సమస్యలపై దృష్టి పెట్టాలని మోదీకి సూచించారు. అంతేకాదు, గతంలో అమెరికా బెదిరించినా ఇందిరా గాంధీ వెనుకాడలేదని, కానీ ట్రంప్ ఒక్క ఫోన్ కాల్ చేయగానే మోదీ పాకిస్థాన్‌తో యుద్ధాన్ని ఆపేశారని ఆరోపించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన నేతలుగా ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలను ఉదహరించిన ఖర్గే, బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్ నుంచి దేశం కోసం ఎవరు ప్రాణాలు అర్పించారో చెప్పాలంటూ సవాల్ విసిరారు. మోదీ, అమిత్ షా అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని తీవ్రంగా విమర్శించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని కార్యకర్తల సమిష్టి శ్రమ ఫలితంగా పేర్కొన్న ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నాయకత్వాన్ని ప్రశంసించారు. కేసీఆర్ పాలనలో రైతులు, మహిళలు, నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని ఆయన ధ్వజమెత్తారు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా కింద రూ. 8,200 కోట్ల నిధుల జమ, సన్నబియ్యం పంపిణీ వంటి పథకాలతో ప్రజలకు మేలు జరుగుతుందని వివరించారు. దేశంలోనే తొలిసారిగా కుల గణన చేపట్టిన రాష్ట్రం తెలంగాణనే అని గర్వంగా చెప్పారు. గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక చట్టం తీసుకురావడమే ఇందుకు నిదర్శనమని ఖర్గే స్పష్టం చేశారు.
Read Mode : కేసీఆర్‌తో బీఆర్ఎస్ నేతల ఇష్టాగోష్టి

2 thoughts on “మోదీ యుద్ధం ఆపేశాడు: ఖర్గే విమర్శ”
Comments are closed.