మంగళగిరి టీడీపీ ఆఫీస్‌పై 2021లో జరిగిన దాడి కేసుకు సంబంధించి వైసీపీ నేత, అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో సజ్జలపై ఇప్పటికే నేరప్రాసంగిక కేసు నమోదు కాగా, సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
సజ్జలతో పాటు వైసీపీ యువనేత దేవినేని అవినాష్ కూడా విచారణకు హాజరయ్యారు. కాగా, సజ్జల విచారణ నేపథ్యంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఏవైనా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
2021 అక్టోబరు 19న మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. కార్యాలయంలోకి ప్రవేశించి వస్తువులను ధ్వంసం చేసిన ఘటనపై టీడీపీ నేతలు అప్పట్లో ఫిర్యాదు చేసినా, పోలీసుల నుంచి స్పందన లేకపోయింది. అయితే, వైసీపీ పాలన ముగిసిన అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ ఈ కేసు తిరిగి తెరపైకి వచ్చింది. ప్రభుత్వం సీఐడీకి విచారణ బాధ్యతలు అప్పగించింది.
సీఐడీ ఇప్పటివరకు ఈ కేసులో పలు ఆధారాలు సేకరించి, కొంతమందిని అరెస్ట్ చేసి, మరికొంతమందిని విచారించింది. తాజా విచారణలో సజ్జల, అవినాష్ పాత్ర ఉందని గుర్తించి, వారిని విచారణకు పిలిచారు. సజ్జలను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా (A1) పేర్కొన్నారు. మరి సజ్జల సీఐడీ విచారణకు ఏ మేరకు సహకరిస్తారో వేచి చూడాలి.
Read More : తెలుగు జవాన్ వీరమరణం
