తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు గురువారం ఉదయం బయలుదేరి వెళ్లారు. ఆయనతోపాటు రాష్ట్ర మునిసిపల్ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఢిల్లీకి వెళ్లారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఉదయం 8 గంటలకు ఢిల్లీకి పయనమైన రేవంత్ బృందం, అక్కడ వివిధ కీలక సమావేశాల్లో పాల్గొననుంది.
ఈ రోజు ఉదయం 11 గంటలకు ఇంగ్లండ్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, గ్లోబల్ చేంజ్ సంస్థ ప్రతినిధులతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం లక్ష్యంగా జరగనున్న ఈ భేటీలో పలు అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటీల్‌తో సమావేశం జరిగేలా షెడ్యూల్ రూపొందించబడింది. గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును ఆపాలంటూ ఆయన విజ్ఞప్తి చేయనున్నారు.
ఇక ఏపీ ప్రభుత్వం సమర్పించిన పీఎఫ్ఆర్‌పై కేంద్రం స్పందన కోరడంతో, కేంద్ర మంత్రులతో కలిసి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరాలు సమర్పించనున్నారు. ప్రత్యేకంగా గోదావరి-బనకచర్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్లకుండా కట్టడి చేయాలనే అంశాన్ని కేంద్రానికి ఉంచనున్నారు.
అంతేకాకుండా, కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో కూడా సీఎం రేవంత్ భేటీ కానున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ సహా పలు అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చలు జరుగనున్నట్లు సమాచారం. అదే సమయంలో ఏఐసీసీ పెద్దలతో నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.
రెండు రోజులపాటు ఢిల్లీలో పర్యటించే సీఎం రేవంత్, పార్టీ అధిష్ఠానాన్ని కలిసే కార్యక్రమాన్ని కూడా ఖరారు చేశారు. ఇదిలా ఉంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం రాత్రికే ఢిల్లీకి చేరుకున్నారు.
టోనీ బ్లెయిర్ గ్లోబల్ చేంజ్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ విధానాల రూపకల్పనలో కీలకంగా పని చేస్తోంది. దీనితో భాగస్వామ్యంగా రాష్ట్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి చర్చలు జరపనున్నారు. ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీకి తరచూ వెళ్తున్నప్పటికీ, ఈసారి పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇటీవలి కాలంలో సీఎం రేవంత్ వాఖ్యరిలో గణనీయమైన మార్పు కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో కేబినెట్ మంత్రులపై వచ్చిన ఆరోపణలపై పెద్దగా స్పందించని ఆయన, ఇప్పుడు పరిస్థితులపై గట్టి నియంత్రణ సాధించే దిశగా అడుగులు వేస్తున్నారని అంచనా వేస్తున్నారు. ఇటీవల వచ్చిన కొత్త ఆత్మవిశ్వాసంతో ఆయన పాలనలో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నదని అంటున్నారు.
Read More : బీసీ రిజర్వేషన్లు కల్పించకపోతే ఎన్నికలు అడ్డుకుంటాం: కవిత
