ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పడిన ఉద్రిక్తతలపై మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విధుల్లో ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై భారత న్యాయసంహిత (భానసం) సెక్షన్లు 188, 332, 353, 427 కింద సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
బుధవారం రోజున జగన్ సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు భారీగా వాహనాల ర్యాలీగా జగన్ వెంట వెళ్లారు. గుంటూరు, నల్లపాడు, మేడికొండూరు మీదుగా పల్నాడు జిల్లా వరకు ఈ ర్యాలీ సాగింది.
జగన్ కాన్వాయ్ రాక సందర్భంగా కొర్రపాడు శివారులోని ఓ పెట్రోల్ బంక్ వద్ద పోలీసులు ట్రాఫిక్ నియంత్రణకు చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. ముందున్న వాహనాలను అనుమతించగా, వెనకున్న కొన్ని వాహనాలను తాత్కాలికంగా ఆపారు. ఇదే సమయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు అక్కడికి చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
వాహనాలు ఎందుకు ఆపారంటూ ప్రశ్నించిన అంబటి, పోలీసుల వివరణను పట్టించుకోకుండా రోడ్డుపై ఉంచిన బారికేడ్లను తన సోదరుడు మురళితో కలిసి తొలగించారని పోలీసులు తెలిపారు. ఈ దృష్ట్యా విధుల్లో ఆటంకం కలిగించారన్న కారణంగా ఆయనపై కేసు నమోదైనట్టు సమాచారం.
ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. అంబటి రాంబాబు చర్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పోలీసులు వాహన రాకపోకలపై ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకున్నారని అధికార వర్గాలు స్పష్టం చేశాయి.
Read More : పన్నుల వసూళ్లపై సీఎం కీలక దిశానిర్దేశం

One thought on “అంబటి రాంబాబుపై పోలీసుల కేసు నమోదు”
Comments are closed.