హైదరాబాద్–తిరుపతి స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం

విమాన ప్రయాణాలపై వరుసగా జరుగుతున్న ప్రమాదాలు ప్రయాణికుల్లో భయాన్ని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా అత్యవసర పనుల నిమిత్తం వేగంగా గమ్యస్థానాలకు చేరాలనుకునే వారు విమాన ప్రయాణంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అహ్మదాబాద్‌లో భారీ విమాన ప్రమాదం, ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్ కూలిన ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు మరువకముందే… తాజాగా హైదరాబాద్‌ నుంచి తిరుపతికి బయలుదేరిన స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.

గురువారం ఉదయం హైదరాబాద్‌ శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి తిరుపతి వైపు బయలుదేరిన స్పైస్‌ జెట్‌ విమానంలో ప్రయాణం మధ్యలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ విషయాన్ని వెంటనే పైలట్ గుర్తించి అప్రమత్తమయ్యాడు. మరో 10 నిమిషాల్లో తిరుపతిలో ల్యాండ్ కావాల్సిన విమానాన్ని తిరిగి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించారు. ప్రయాణికులు అసహనానికి లోనయ్యారు. తమ ప్రయాణం వాయిదా పడినందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రత్యామ్నాయ విమానం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అయితే స్పైస్‌ జెట్‌ యాజమాన్యం నుంచి ఎలాంటి అధికారిక వివరణ రాలేదు.

ఇది ఇలా ఉండగా, ఈ నెల 16న కూడా శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో స్పైస్‌ జెట్‌ విమానంలో సాంకేతిక లోపం కారణంగా పొగలు రావడంతో ప్రయాణికులు తీవ్ర ఉత్కంఠకు లోనయ్యారు. స్పైస్ జెట్ 2138 నంబర్ ఫ్లైట్ టేకాఫ్‌ కు సిద్ధమవుతున్న సమయంలో విమానంలో కాలిన వాసన రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే విమానాన్ని నిలిపివేసి తనిఖీలు చేశారు. ఈ కారణంగా ప్రయాణికులు మూడున్నర గంటల పాటు విమానాశ్రయంలోనే వేచి ఉండాల్సి వచ్చింది.

ఒక్కవేళ ఈ లోపం టేకాఫ్ తర్వాత ఎదురైతే ప్రాణాలకే ప్రమాదం అనే భయంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ తరహా సంఘటనలు తరుచుగా జరుగుతుండటంతో విమాన ప్రయాణాల భద్రతపై ప్రయాణికులు శంకించుకుంటున్నారు. అధికారులు తక్షణమే స్పందించి ఈ లోపాలపై సమగ్ర విచారణ జరిపి, అవసరమైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

Read More : పన్నుల వసూళ్లపై సీఎం కీలక దిశానిర్దేశం