బీసీ రిజర్వేషన్ల విషయంలో స్పష్టత లేకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం యత్నిస్తే కచ్చితంగా ఎదుర్కొంటామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు జరగాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ఇది తేలికగా దాటదని ఆమె హెచ్చరించారు.
హైదరాబాద్లో మంగళవారం మీడియాతో మాట్లాడిన కవిత, “రెవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు న్యాయం చేసే హామీ ఇవ్వాలి. తగిన అనుమతులు తీసుకువచ్చిన తర్వాతే నామినేషన్లు వేయాలి. లేదంటే ప్రతి వార్డులో వందల సంఖ్యలో నామినేషన్లు వేసి ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తాం,” అని స్పష్టం చేశారు.
బీసీ రిజర్వేషన్ల బిల్లును తెలంగాణ అసెంబ్లీ, మండలిలో ఆమోదించి కేంద్రానికి పంపామని తెలిపారు. జులై రెండో వారంలోపే కేంద్రం ఆమోదించకపోతే జూలై 17 నుంచి దేశవ్యాప్తంగా రైలు రోకోలు వంటి నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఇక, గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు, బొల్లాపల్లి రిజర్వాయర్ నిర్మాణాలను వెంటనే అడ్డుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. ఇవి తెలంగాణకు నష్టం కలిగించే ప్రాజెక్టులని ఆమె వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన “ఆపరేషన్ కగార్” పై కూడా స్పందించిన కవిత… ఈ ఆపరేషన్ను తక్షణమే నిలిపివేయాలని, మావోయిస్టులతో శాంతియుత చర్చల దిశగా కేంద్రం ముందడుగు వేయాలని సూచించారు. ఎన్కౌంటర్లు అమానవీయమైన చర్యలని పేర్కొన్న ఆమె, చర్చలే దీర్ఘకాలిక పరిష్కారమని అభిప్రాయపడ్డారు.
Read More : తెలంగాణకు గోదావరి జలాల్లో న్యాయం కావాలి: ఎంపీ చామల

One thought on “బీసీ రిజర్వేషన్లు కల్పించకపోతే ఎన్నికలు అడ్డుకుంటాం: కవిత”
Comments are closed.