పశ్చిమగోదావరి: రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల పనులను వేగంగా పూర్తి చేసి రైతులకు నీటి కొరత లేకుండా చూడడం ప్రభుత్వ లక్ష్యమని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సోమవారం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన, పోలవరం ఎడమ కాల్వ పనులను ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి ఉత్తరాంధ్రకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అలాగే, వెలిగొండ ప్రాజెక్టును 2026 జూన్ నాటికి పూర్తి చేయనున్నట్లు స్పష్టం చేశారు.
రాయలసీమకు హంద్రీనీవా ప్రాజెక్టు కీలకం
రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే హంద్రీనీవా ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 700 కిలోమీటర్ల మేర నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
నీటిపారుదల అభివృద్ధి కోసం భారీ కేటాయింపులు
పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో 99 పనుల కోసం రూ. 37.63 కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. పాలకొల్లు పట్టణంలోని పది వార్డులను ముంచెత్తే దమయ్యపర్తి కోడు ప్రక్షాళనకు రూ. 14 కోట్లు మంజూరు చేశామని తెలిపారు.
యలమంచిలిలో గోదావరి ఏటిగట్టు పటిష్టత
యలమంచిలి మండలంలో గోదావరి ఏటిగట్టు పటిష్టత కోసం రూ. 8 కోట్లు వ్యయంతో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ మురుగు కాలువల ప్రక్షాళనకు రూ. 16 కోట్లతో పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.
మరమ్మతులు, కొత్త ప్రాజెక్టులు
కాజ, మాదవయ్యపాలెం స్లూయిస్ మరమ్మతుల కోసం రూ. 9 కోట్లు అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. త్వరలో చింతలపూడి ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు.

One thought on “మంత్రి నిమ్మల రామానాయుడు: రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ”
Comments are closed.