మహానాడు డ్రామా.. చంద్రబాబు ఫోజులే తప్ప అభివృద్ధి లేదు.

తాడేపల్లి: తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడుపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహానాడు పేరుతో పెద్ద డ్రామా చేస్తున్నారని, చంద్రబాబు నాయుడు ఫోటోల కోసం ఫోజులిస్తే ఏమి లాభమని ఎద్దేవా చేశారు. టీడీపీ అంటే తెలుగు డ్రామాల పార్టీగా మారిందని విమర్శించారు.

తాడేపల్లిలో బుధవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో జగన్ మాట్లాడుతూ – “మహానాడు కడపలో చేయడం హీరోయిజం కాదు. నన్ను తిట్టడమూ హీరోయిజం కాదు. నిజమైన హీరోయిజం అంటే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఎటువంటి హామీని నెరవేర్చలేదు” అని ధ్వజమెత్తారు.

చంద్రబాబు ప్రభుత్వం “సూపర్ సిక్స్” పేరుతో చెప్పిన పథకాలు, “సూపర్ సెవెన్” హామీలను గాలికి వదిలేసిందని విమర్శించారు. ఏ ఇంటికైనా టీడీపీ నేతలు వెళ్లి తమ పాలనలో చేసిన అభివృద్ధిని చూపించగలరా? అని జగన్ ప్రశ్నించారు.

ఉచిత బస్సు ప్రయాణం కోసం మహిళలు ఎదురుచూస్తున్నారని, గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయలేని దుస్థితి ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ, టోఫెల్, నాడు-నేడు, ట్యాబ్‌లను నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

తమ ప్రభుత్వ హయాంలో మూడు నెలలకోసారి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చామన్నారు. ఇప్పుడు మాత్రం తల్లిదండ్రులు చదువులు ఆపేసి పిల్లలను పనులకు పంపే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. అమ్మఒడి పథకాన్ని పూర్తిగా ఆపేశారని, ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతులకు కనీస మద్దతు ధర లేక, వారి బతుకులు దళారుల చేతుల్లో నలిగిపోతున్నాయని అన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో రూ.2.73 లక్షల కోట్ల డీబీటీ అందించామని గుర్తుచేశారు. ఇప్పుడైతే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది? అని ప్రశ్నించారు.

Read More : మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు.

One thought on “మహానాడు డ్రామా.. చంద్రబాబు ఫోజులే తప్ప అభివృద్ధి లేదు.

Comments are closed.