ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి మాలపల్లిలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. విజయవాడ రైల్వేలో పని చేస్తున్న దంపతులు – గూడవల్లి ఆనంద్, సునీత (ఆర్పీఎఫ్ కానిస్టేబుల్) –పై మద్యం మత్తులో ఉన్న దుండగులు విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు.
ఘటన వివరాల్లోకి వెళితే… ఆదివారం రాత్రి విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తుండగా, వీరి ద్విచక్రవాహనాన్ని ఓ దుండగుడు వెనుకనుండి ఢీకొట్టాడు. ఈ ఘటనపై ఆనంద్ అతనితో వాగ్వాదానికి దిగగా, అతడు మద్యం మత్తులో సునీత దగ్గరకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. ఇప్పటికే ఐదు నెలల గర్భిణిగా ఉన్న సునీత, అతనిని చెప్పుతో కొట్టింది.
దీనితో ఆగ్రహానికి గురైన దుండగుడు తన గ్యాంగ్‌కు సమాచారం ఇచ్చి 10 మంది రౌడీలను అక్కడికి రప్పించాడు. వారు భార్యభర్తలపై బండరాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. “నా భార్య గర్భవతి… దయచేసి వదలండి” అని ఆనంద్ వేడుకున్నా… కనికరించకుండా దాడి కొనసాగించారని బాధితులు వాపోయారు.
ఇద్దరికీ తీవ్రగాయాలవడంతో వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. వీరి కేకలు విన్న స్థానికులు, వాహనదారులు సహాయానికి వస్తే, వారిని కూడా బెదిరించి వెనక్కి పంపించినట్లు సమాచారం. పోలీసులకు సమాచారం ఇవ్వగా, దర్యాప్తు కొనసాగుతోంది. బాధితుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ దారుణ ఘటనపై స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
Read More : భీమిలిలో బాలికపై అత్యాచారం

One thought on “గర్భిణీ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ పై దాడి”
Comments are closed.