విమాన ప్రమాదంపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి.

అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం ఊహించని విధంగా చోటు చేసుకుని అనేకమందిని మృతికి గురి చేసిన ఘటనను ఆయన తీవ్ర దిగ్భ్రాంతితో స్వీకరించారు. గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన తన ఆవేదనను వెల్లడించారు.

అహ్మదాబాద్ నుంచి 242 మంది ప్రయాణికులతో లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిందని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ విమానం సమీపంలోని వైద్య కళాశాల వసతి గృహ భవనాలపై కూలడం మరింత విషాదకర పరిస్థితిని తలెత్తించిందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ‘‘అహ్మదాబాద్‌లో చోటు చేసుకున్న ఈ ప్రమాదం ఎంతో విషాదంగా ఉంది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కుప్పకూలిపోవడం ఊహించని విషాదాన్ని తెచ్చింది. ముఖ్యంగా వైద్య కళాశాల వసతిగృహ భవనాలపై విమానం కూలడంతో విద్యార్థులు, వారి కుటుంబాల జీవితాలు అకాలంగా ముగియడం ఎంతో బాధాకరం’’ అని అన్నారు.

ఈ కష్టకాలంలో మృతుల కుటుంబాలకు దేశం మొత్తం అండగా నిలవాలని పవన్ కల్యాణ్ కోరారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం కలగాలని ప్రార్థించారు.

Read More : తెలుగు రాష్ట్రాల్లో విస్తారమైన వర్షాలు…