ఎన్టీఆర్ జిల్లా, పెనుగంచిప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ తిరుణాలలో జరిగిన ఘర్షణపై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పోలీసులపై రాళ్లతో దాడి చేయడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడగా, భక్తులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
దాడి ఘటనపై హోంమంత్రి అనిత స్పందించి, ఈ ఘటనకు కారణమైన వారందరిపై కేసులు నమోదు చేయాలని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబుకు ఆదేశాలు జారీ చేశారు. దాడిలో గాయపడిన జగ్గయ్యపేట సీఐ వెంకటేశ్వర్లు ఆరోగ్య పరిస్థితిని గురించి ఆమె ఆరా తీశారు. నందిగామ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలనీ అధికారులను ఆదేశించారు.
పోలీసులపై రాళ్ల దాడి
తిరుణాలలో తెలుగుదేశం, జనసేన, వైఎస్సార్‌సీపీ నేతల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రభల ఊరేగింపులో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఈ క్రమంలో అడ్డుకున్న పోలీసులపై రాళ్లు, వాటర్ ప్యాకెట్లు, బాటిళ్లు విసిరారు. ఈ ఘటనలో నలుగురు పోలీసులకు గాయాలు కాగా, స్థానికులు కూడా గాయపడినట్లు సమాచారం.
ప్రణాళికాబద్ధంగానే దాడి
వైఎస్సార్‌సీపీ శ్రేణులు ముందస్తు ప్రణాళికతోనే రెచ్చగొట్టే చర్యలకు దిగి దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. పోలీసులను లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వకంగా రాళ్ల దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో గాయపడినవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
హోంమంత్రి అనిత ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తూ, శాంతిభద్రతలను భద్రంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. “పోలీసులపై దాడిని ఏమాత్రం సహించబోము,” అని ఆమె హెచ్చరించారు.
One thought on “పెనుగంచిప్రోలు ఘటనపై హోంమంత్రి అనిత తీవ్ర ఆగ్రహం”
Comments are closed.