తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి హస్తిన బాట పట్టనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాస్తూ, అఖిలపక్ష ప్రతినిధుల సమావేశానికి సమయం ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ప్రధానికి ఈ లేఖ రాశారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు కేంద్ర మద్దతు కోరుతూ ఈ విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ శాసనసభలో విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఆమోదించిన రెండు బిల్లుల గురించి లేఖలో ప్రస్తావించారు. పార్లమెంట్‌లో వీటి ఆమోదం కోసం అఖిలపక్షంగా కలిసి కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
తెలంగాణలో ప్రస్తుతం విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో షెడ్యూల్ కులాలకు 15 శాతం, షెడ్యూల్ తెగలకు 7 శాతం, మైనారిటీలకు 4 శాతం, బీసీలకు 23 శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. అయితే, కులగుణ నివేదిక ప్రకారం బీసీల శాతం 56.36 అని వెల్లడైంది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల పెంపు అవసరమని వివరించారు.
ఇక ఈ మేరకు బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ ప్రతినిధులతో కలిసి ఢిల్లీ వెళ్లేందుకు అఖిలపక్షం సిద్ధమవుతోంది. ప్రధాని కార్యాలయం నుంచి సమయం ఖరారు కానున్నట్లు సమాచారం.
చర్లపల్లి స్టేషన్ పేరుపై లేఖ
ఇక మరో అంశంగా, సీఎం రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌కు కూడా లేఖ రాశారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్ పేరును “పొట్టి శ్రీరాములు చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్” గా మార్చాలని కోరారు. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టినట్లు గుర్తుచేస్తూ, చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

2 thoughts on “** ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ.. బీసీ రిజర్వేషన్లకు మద్దతు కోరుతూ అఖిలపక్ష భేటీకి డిమాండ్**”
Comments are closed.