వచ్చే ఏడాది నాటికి కోటి మొక్కల లక్ష్యం

Pawan Kalyan film updates

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అమరావతి సమీపంలోని అనంతవరం గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ప్రసంగించారు. పర్యావరణ పరిరక్షణపై ఆయన చేసిన వ్యాఖ్యలు అక్కడున్న వారిని ప్రభావితం చేశాయి.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, ‘‘రాబోయే ఏడాది ఇదే రోజు నాటికి రాష్ట్రవ్యాప్తంగా కనీసం కోటి మొక్కలు నాటడమే నా ముఖ్య లక్ష్యం’’ అని చెప్పారు. అడవుల్లో కార్చిచ్చు నివారణ, పశుపాలకులకు అవగాహన కల్పించడం, అటవీ నరికివేత తగ్గించడం వంటి కీలక కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు.

పర్యావరణవేత్త కుమెర అంకారావు సేవలను పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రశంసించారు. 14 ఏళ్ల వయసులో ప్లాస్టిక్ తిని ఒక పక్షి చనిపోవడం చూసి ప్రభావితమైన అంకారావు మూడు దశాబ్దాలుగా పర్యావరణ పరిరక్షణకు అంకితంగా పనిచేస్తున్నారని తెలిపారు. ‘‘అలాంటి నిబద్ధత నాకు లేదేమో అనిపిస్తుంది. ఆయన వంటి వ్యక్తిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ధన్యవాదాలు’’ అని పవన్ అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు పర్యావరణ పరిరక్షణలో ప్రేరణ అని పేర్కొన్న పవన్ కల్యాణ్, ‘‘చెట్టు-నీరు వంటి కార్యక్రమాల ద్వారా ఆయన ముందే మంచి మార్గం చూపించారు. ఆయన మార్గదర్శకత్వంలో పర్యావరణ మంత్రిగా నా బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తాను’’ అని హామీ ఇచ్చారు.

పర్యావరణంపై తన భావాలు వెల్లడిస్తూ, చెట్లు జీవితానికి ఆధారం అని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. ‘‘ఒకప్పుడు ఇంటికి దారి చెప్పాలంటే చెట్టునే సూచనగా ఉపయోగించేవాళ్లు. ఇప్పుడు అలాంటి చెట్లు కనిపించడమే అరుదు. మన జీవన శైలిలో పచ్చదనం లేనిదే వాతావరణ సమతుల్యత సాధ్యం కాదు’’ అని వివరించారు.

రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 50 శాతానికి చేరేలా సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని, ఆ దిశగా తనవంతు కృషి చేస్తానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ‘‘ఇదే సమయానికి వచ్చే ఏడాది మరింత అనుభవంతో, పూర్తి బాధ్యతతో మీ ముందుకొస్తాను’’ అని తెలిపారు.

ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణపై సర్కారు యొక్క సంకల్ప బలాన్ని పవన్ కల్యాణ్ మరోసారి ఋజువుచేశారు.

Read More : ఏపీలో నాలుగేళ్లలో ఐదు కోట్ల మొక్కలు: సీఎం చంద్రబాబు.

One thought on “వచ్చే ఏడాది నాటికి కోటి మొక్కల లక్ష్యం

Comments are closed.